మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతికత  | Developments and Priorities in CJI Surya Kant AI Strategy | Sakshi
Sakshi News home page

మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతికత 

Jun 8 2026 4:58 AM | Updated on Jun 8 2026 4:58 AM

Developments and Priorities in CJI Surya Kant AI Strategy

సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టీకరణ  

న్యూఢిల్లీ:  స్వదేశీ న్యాయశాస్త్రం అభివృద్ధికి మనం గణనీయమైన ప్రాధాన్యత ఇచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పారు. న్యాయపరమైన అంశాల్లో స్వతంత్ర ఆలోచనకు ప్రత్యామ్నాయంగా కాకుండా, మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్, ఆక్స్‌ఫర్డ్‌ లా సొసైటీలో ‘డిజిటల్‌ వాస్తవికతకు రాజ్యాంగ వాగ్దానం: ఏఐ, సాంకేతిక పురోగతి యుగంలో న్యాయాన్ని పరిరక్షించడం’ అనే అంశంపై జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రసంగించారు. 

ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక కార్యక్రమాలకు అదనంగా న్యాయవ్యవస్థ కోసం స్వదేశీ కృత్రిమ మేధ(ఏఐ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం దిగుమతి చేసుకున్న సాంకేతిక నమూనాలు లేదా అంచనాలపై ఆధారపడకుండా, మన సొంత రాజ్యాంగ విలువలు, సంస్థాగత వాస్తవాలు, భాషా వైవిధ్యం, సామాజిక పరిస్థితుల పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. 

న్యాయ వ్యవస్థలో నేడు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయ వ్యవస్థలను ఒకదానితో ఒకటి మరింత సన్నిహితంగా సంభాషించుకునేలా చేసిందన్నారు. ప్రపంచ న్యాయ సమాజం టెక్నాలజీతో పరస్పరం అనుసంధానం అవుతోందని వెల్లడించారు. న్యాయవ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులు దోహదపడుతున్నారని పేర్కొన్నారు. సాంకేతికత అనేది మానవ విచక్షణను ఎన్నటికీ భర్తీ చేయలేదని తేల్చిచెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement