డీలిమిటేషన్‌ బిల్లు ఈ నెలలోనే! | Delimitation Bill to be passed this month by Modi Govt | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌ బిల్లు ఈ నెలలోనే!

Apr 2 2026 1:12 AM | Updated on Apr 2 2026 1:12 AM

Delimitation Bill to be passed this month by Modi Govt

అందుకోసం పార్లమెంట్‌ సమావేశాల పొడిగింపు

నేడు నిరవధిక వాయిదా ఉండబోదు 

మూడో వారంలో ప్రత్యేక సమావేశాలు 

మూడు రోజులపాటు జరిగే అవకాశం 

సీట్ల పెంపునకు ఆమోదముద్ర! 

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌ చట్టాల సవరణకూ బిల్లులు

లోక్‌సభలో ప్రస్తుత సీట్లు: 543

కొత్త చట్టం అందుబాటులోకి వస్తే మొత్తం సీట్లు: 816

న్యూఢిల్లీ: లోక్‌సభ స్థానాల పెంపు బిల్లుకు పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే ఆమోదముద్ర పడేలా కనిపిస్తోంది. ఇందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏప్రిల్‌ మూడోవారంలో ప్రత్యేకంగా రెండు నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. జనవరి 28న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు షెడ్యూల్‌ ప్రకారం గురువారం నిరవధికంగా వాయిదా పడాల్సి ఉంది. ‘‘అందుకు బదులుగా, ఏప్రిల్‌ మూడో వారంలో ఉభయ సభలు ఏ తేదీన భేటీ అయ్యేదీ సభాపతులు గురువారం ప్రకటిస్తారు. సమావేశాలను అప్పటిదాకా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంటారు’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం మేరకు పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి రావడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గత వారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు పలు కాంగ్రెసేతర పార్టీల నేతలతో కూడా పంచుకు న్నారు. ఆ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాల మేరకు లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కు పెరగనుంది. వాటిలో 273 స్థానాలను మహిళలకు రిజర్వు చేయనున్నారు. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’చట్టాన్ని 2023లోనే పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. అయితే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు పూర్తయిన అనంతరమే ఆ చట్టం అమల్లోకి రానుంది. 

అయితే 33 శాతం మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కూడా వర్తింపజేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ‘‘అలాగే డీలిమిటేషన్‌ చట్టాన్ని సవరిస్తూ మరో సాధారణ సవరణ బిల్లు కూడా ప్రవేశపెడతారు. వాటికి పార్లమెంటు ఆమోదం లభిస్తే అవి చట్ట రూపం పొంది 2029 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తాయి. ఫలితంగా 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు వీలవుతుంది’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాల సంఖ్యను 50 శాతం పెంచుతున్నందున వాటిలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాల సంఖ్య కూడా ఆ మేరకు పెరగనుంది. 

దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతుంది. వాటిలో 12 నుంచి 13 సీట్లు మహిళలకు, రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనుంది. వాటిలో 86 నుంచి 87 స్థానాలను మహిళలకు ప్రత్యేకిస్తారు. తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయి. వాటిలో 8 నుంచి 9 సీట్లు మహిళలకు రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగుతాయి. వాటిలో 59 స్థానాలను మహిళలకు ప్రత్యేకిస్తారు. నియోజకవర్గాల పెంపుకు 2027 జనాభా లెక్కలను కాకుండా 2011 గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని మోదీ సర్కారు నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపు విషయమై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి ప్రధాన పారీ్టలతో ఎన్డీఏ ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement