ఢిల్లీలో వరుణుడి ఉగ్రరూపం

Delhi sees a new record amid heavy rain over last 24 hours - Sakshi

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో వరుణ దేవుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో ఏకంగా 74 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2007 తర్వాత నగరంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇది రెండోసారి. శనివారం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షాల వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. వాయు నాణ్యత మెరుగుపడింది. గాలి నాణ్యత సూచి ఆదివారం ఉదయం 9 గంటలకు 54గా నమోదయ్యింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు గణాంకాల ప్రకారం ఇది ‘గుడ్‌’ కేటగిరీలోకి వస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది ప్రస్తుత సీజన్‌లో సగటు కంటే తక్కువే కావడం గమనార్హం.

శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 20.8 డిగ్రీలు కాగా, శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు. రెండింటి మధ్య వ్యత్యాసం 2.6 డిగ్రీలు. నగరంలో 1969 తర్వాత ఇదే అతి తక్కువ వ్యత్యాసమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1998 అక్టోబర్‌ 19న ఈ వ్యత్యాసం 3.1 డిగ్రీలు నమోదయ్యందని చెప్పారు.  నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఢిల్లీలో రుతుపవనాలు గత నెల 29న వెనక్కి మళ్లాయి. రుతుపవనాల సీజన్‌ ముగిసింది. పశ్చిమ వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top