లిక్కర్‌ స్కాం కేసు: సీబీఐ ఆఫీసులో సిసోడియా.. అరెస్ట్‌ ప్రచారంతో అలర్ట్‌!

Delhi Liquor Scam: AAP Manish Sisodia At CBI Office Updates - Sakshi

సాక్షి, ఢిల్లీ: రాబోయే కొన్నినెలలు జైల్లో గడపాల్సి వచ్చినా పట్టించుకోను. ఎందుకంటే.. నేను భగత్‌ సింగ్‌ మార్గాన్ని అనుసరించే వ్యక్తి. తెలుసు కదా.. దేశం కోసం ఆయన తన ప్రాణాలను అర్పించాడు!. లిక్కర్‌ పాలసీ కేసులో.. సీబీఐ విచారణకు వెళ్లబోయే ముందు మనీశ్‌ సిసోడియా చేసిన ట్వీట్‌ ఇది. 

ఆమ్‌ఆద్మీ పార్టీలో నెంబర్‌ 2 నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా లిక్కర్‌ స్కాంలో విచారణ కోసం ఆదివారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఆయన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి సీబీఐ ఆయన్ని ప్రశ్నిస్తోంది.  ఆప్‌ కార్యకర్తలు, తన మద్దతుదారులతో భారీ ర్యాలీగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్నారు. దారిపొడవునా సిసోడియా మద్దతు నినాదాలు, బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారంతా. ఇక మార్గమధ్యంలో ఆయన రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. అక్కడే ఆయన ప్రసంగించారు. 

జైలుకు వెళ్లేందుకు నేను భయపడను. ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌కు భయపడుతున్నారు.  మేం మోదీకి, బీజేపీకి భయపడం. నిజాయితీగా పని చేశా.  ఆరోపణలన్నీ అవాస్తవాలే. ఇది సవాళ్లు ఎదుర్కొనే సమయం. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించేది ఆప్‌ మాత్రమే అని సిసోడియా ప్రసంగించారు.  ఒకవేళ ఏడు, ఎనిమిది నెలలపాటు నేను జైల్లో గడపాల్సి వస్తే.. గర్వంగా భావించండి. కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ బయపడతున్నారు. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు. నా భార్య ఇంటి వద్ద అనారోగ్యంతో ఉంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఢిల్లీ చిన్నారులకు నేను చెప్పేది ఒక్కటే.. తల్లిదండ్రుల మాట వినండి.. బాగా చదువుకోండి అని ప్రసంగించారు. 

మరోవైపు సిసోడియాను విచారణ పేరిటి పిలిపించి.. సీబీఐ అరెస్ట్‌ చేయబోతుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. సీబీఐ హెడ్‌ క్వార్టర్‌తో పాటు పలు చోట్ల సిబ్బందిని మోహరించి.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు ఆప్‌ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు కూడా. 

ఇదిలా ఉంటే.. సిసోడియాను ఉద్దేశించి ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. దేవుడు మీతోనే ఉంటాడని, ఢిల్లీలోని లక్షల మంది తల్లిదండ్రులు ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవేళ దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లడం ఎంత మాత్రం శాపం కాదని పేర్కన్నారాయన. అదొక ఘనతగా అభివర్ణించారు. జైలుకు వెళ్లినా వెంటనే తిరిగి రావాలని తనతో పాటు యావత్‌ ఢిల్లీ ఆకాంక్షిస్తోందని చెప్పారాయన. 

లిక్కర్‌ స్కాంలో ఫిబ్రవరి 19వ తేదీనే సిసోడియాను సీబీఐ ప్రశ్నించేందుకు పిలిచింది. అయితే.. సిసోడియా విద్యాశాఖతో పాటు ఆర్థిక మంత్రి కూడా(ఇంకా పలు శాఖలను పర్యేవేక్షిస్తున్నారు). దీంతో ఢిల్లీ బడ్జెట్‌ తయారీకి వారం గడువు కావాలని ఆయన దర్యాప్తు సంస్థను కోరారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని.. అనుమతి ఇచ్చింది. 

ఇదిలా ఉంటే.. దేశ రాజధానిలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ విధానం అవినీతి మరక అంటించుకుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కిందటి ఏడాది సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఆ వెంటనే ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం పాలసీని తెరపైకి తెచ్చి.. కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ నిందించింది.

ఇదిలా ఉంటే.. లిక్కర్‌ పాలసీ కేసు ఛార్జిషీట్‌లో ఏడుగురు నిందితుల పేర్లను పేర్కొన్న సీబీఐ.. సిసోడియా పేరు మాత్రం పేర్కొనలేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top