Marital Rape Verdict: సంచలనం.. మారిటల్‌ రేప్‌పై భిన్న తీర్పులు!వేర్వేరు ఆదేశాలిచ్చిన జడ్జిలు

Delhi High Court: Split Verdict On Marital Rape Criminalisation - Sakshi

భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని (మారిటల్‌ రేప్‌).. నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువడింది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ వేర్వేరు అభిప్రాయాలను వెలువరించడంతో గందరగోళం నెలకొంది. అంతేకాదు ఈ గందరగోళం నడుమ.. తాము ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు పిటిషర్లకు అనుమతి ఇచ్చింది బెంచ్‌. 

న్యూఢిల్లీ: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తీర్పు ఇవాళ రానే వచ్చింది. అయితే మారిటల్‌ రేప్‌ (వైవాహిక అత్యాచారం)పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఇవాళ భిన్న తీర్పులు వెలువరించారు. వైవాహిక జీవితంలో భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ రాజీవ్‌ షక్దేహర్‌ ఆదేశాలు ఇచ్చారు. 

అయితే బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ సీ హరిశంకర్‌ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 19, 21లను సెక్షన్‌ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందన​డానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని, కాబట్టి, భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని అన్నారు. ఈమేరకు జస్టిస్‌ రాజీవ్‌ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదంటూ పేర్కొన్నారు. దీంతో భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్లయ్యింది.

బుధవారం ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మారిటల్‌ రేప్‌పై ఈ తరహా తీర్పు వెలువరించింది. ఐపీసీలోని అత్యాచార సెక్షన్‌-375(మినహాయింపు 2) నుంచి మారిటల్‌ రేప్‌నకు మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఏడేళ్ల కిందట(2015లో) ఈ వ్యవహారంపై మొదటి పిటిషన్‌ దాఖలుకాగా, ఆ తర్వాత మరికొన్ని దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లకు కౌంటర్‌గా.. పురుష హక్కుల సంఘాలు కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించకూడదనే ఆ పిటిషన్‌లో కోరాయి పురుష హక్కుల సంఘాలు. 

అయితే ఈ పిటిషన్లపై ఈ ఏడాది జనవరి నుంచి రోజూవారీ వాదనలు జరిగాయి. చివరికి.. తీర్పును ఫిబ్రవరి 21వ తేదీన రిజర్వ్‌లో ఉంచింది కోర్టు. గతంలో మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించలేమంటూ కేంద్రం పేర్కొనగా.. ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో తమ ప్రకటనను పరిశీలిస్తామంటూ డబుల్‌ గేమ్‌ ఆడింది. మరోవైపు మారిటల్‌​ రేప్‌ నేరం కాదంటూ సుప్రీం కోర్టు సైతం కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పుపై.. పిటిషనర్లు సుప్రీంకు వెళ్లేందుకు మార్గం సుగమం కావడం గమనార్హం.

చదవండి: సెక్స్‌ బానిసగా భార్య.. కూతురి ముందే అసహజ శృంగారం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top