ప్రధాని మోదీకి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్షమాపణలు

Delhi CM Arvind Kejriwal Appologise to PM Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరుగుతోందంటూ ప్రశ్నించడంతో సీఎం కేజ్రీవాల్‌ తేరుకుని క్షమించాలి అని తెలిపారు.

ఇంతకు ఏం జరిగిందంటే.. ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశాన్ని ఆమ్‌ఆద్మీ పార్టీ లైవ్‌ టెలికాస్ట్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మోదీ కేజ్రీవాల్‌ మాట్లాడుతున్న సమయంలో ‘ఏం జరుగుతోంది?’ అని ప్రశ్నించారు. ‘ఇది మన సంప్రదాయానికి విరుద్ధం కదా’ అని తెలపడంతో కేజ్రీవాల్‌ స్పందించి వెంటనే క్షమాపణలు చెప్పారు. ఈ సమావేశం గురించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సీఎం అరవింద్‌ తెలిపారు. ఇకపై జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. అయితే ఈ వివాదంపై ఆమ్‌ఆద్మీ పార్టీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ వివరణ ఇచ్చారు. ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఎలాంటి ఆదేశాలు లేవని, గతంలో చాలా సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు గుర్తుచేశారు. ప్రజలకు ప్రాధాన్యమైన అంశం కావడంతో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు సీఎంఓ తెలిపింది. ప్రత్యక్ష ప్రసారంతో ఎవరికైనా ఇబ్బందికలిగితే తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఢిల్లీ సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ సమావేశ ప్రసారం ప్రొటోకాల్‌ ఉల్లంఘనగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top