
యశవంతపుర: రేణుకాస్వామి హత్య కేసులో నిందితులు నటీనటులు దర్శన్, పవిత్రాగౌడ బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. బెయిలు రద్దు చేయరాదని ఇరువురి తరఫు వకీళ్లు లిఖితపూర్వకంగా వాదనలను సమర్పించారు. హైకోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడం తెలిసిందే. ఇరువైపులా న్యాయవాదుల బలమైన కారణాలను పేర్కొన్నారు. అసలు రేణుకాస్వామిని అపహరించినట్లు, హత్య చేసినట్లు దర్శన్‌పై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన లాయర్లు పేర్కొనడం గమనార్హం.
ప్రభుత్వ వాదనలు ఇలా
ప్రభుత్వ న్యాయవాదుల వాదనల్లో.. మృతుడు రేణుకాస్వామి దర్శన్ అభిమాని. దర్శన్ పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నాడని కోపగించి అవహేళన సందేశం పంపాడని రేణుకాస్వామిని అపహరించి బెంగళూరులో పట్టణగెరె వద్ద ఒక షెడ్డులో హత్య చేశారు. నిందితులందరూ హత్య చేసిన స్థలంలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడి మట్టి నమూనాలు అందరి పాదరక్షలలోను ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది అంటూ పలు కారణాలను పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.