కేరళ ఆర్టీసీ బస్సు బుగ్గి
● 40 మందికిపైగా ప్రయాణికులు క్షేమం
మైసూరు: ప్రయాణికులతో వెళుతున్న కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న 40 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు హొసళ్లి గేట్ సమీపంలో జరిగింది. మైసూరు నుంచి కేరళకు వెళ్తున్న బస్సు గురువారం అర్ధరాత్రి సమయంలో హొసళ్లి గేట్ వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దింపేశాడు. అనంతరం కొన్ని నిమిషాల్లోనే మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశారు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
జగదీశ్వరి ఆలయంలో
డీసీఎం పూజలు
దొడ్డబళ్లాపురం: డీసీఎం డీకే శివకుమార్ శుక్రవారం కార్వార జిల్లా అంకోల తాలూకాలో ఉన్న ప్రసిద్ద జగదీశ్వరిదేవి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. ఆయనతో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మంకాళ వైద్య, ఎమ్మెల్యే సతీస్ సైల్ ఉన్నారు. అయితే వీరందరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను బయటే ఉంచి డీకే శివకుమార్ ఆలయ గర్భగుడి తలుపులు మూసి పూజలు చేశారు.
కాలితో తన్నడంతో
గాల్లోకి లేచి పడిన చిన్నారి
దొడ్డబళ్లాపురం: రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి ఫుట్‌బాల్ తరహాలో కాలితో తన్నాడు. దీంతో బాలిక గాల్లోకి లేచి కిందపడి గాయపడింది. ఈ అమానుష సంఘటన బెంగళూరు త్యాగరాజగనర్‌లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి ఇంటి బయట బ్యాడ్మింటన్ ఆడుతుండగా వెనుక నుంచి వచ్చిన రంజన్ అనే వ్యక్తి కాలితో తన్నాడు. దీంతో ఆ చిన్నారి గాల్లోకి లేచి కిందపడింది. చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా తన్నాడో తెలియరాలేదు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి రంజన్(35)ను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది.
లీటర్ పాలపై ప్రోత్సాహక ధనం రూ.7కు పెంపు
● ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి
శివాజీనగర: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బెళగావి సమావేశాల్లో సిద్దరామయ్య అతి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇంతకాలం ప్రతి లీటర్ పాలకు రూ.5ల ప్రోత్సాహ ధనం ఇచ్చేవారు. రైతుల మేలు దృష్ట్యా వారికి ఇస్తున్న రూ.5ల ప్రోత్సాహ ధనాన్ని రూ.7లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. ప్రస్తుత ప్రోత్సాహ ధనం రైతులకు పూర్తిగా చేరటం లేదనే ఆరోపణలపై శుక్రవారం విధానసభలో సీఎం సమాధానమిచ్చారు. ధర పెంపుదలతో పాటు ప్రభుత్వం నుంచి పాడి రైతులకు సాయం కొనసాగుతుందన్నారు.
కేరళ ఆర్టీసీ బస్సు బుగ్గి
కేరళ ఆర్టీసీ బస్సు బుగ్గి


