ప్రజల సహకారం అవసరం
మాలూరు: అవినీతి రహిత తాలూకా నిర్మాణమే తమ లక్ష్యమని, ఇందుకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని స్వాభిమాన పార్టీ సంస్థాపక అధ్యక్షుడు హూడి విజయకుమార్ పేర్కొన్నారు. నగరంలోని అరళేరి రోడ్డులోని ఆయన నివాసంలో కాంగ్రెస్, బీజేపీ ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పాలనకు విసిగిన చాలామంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో తాలూకాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని, అవినీతి పెచ్చుమీరిపోయిందని ఆరోపించారు. లంచం ఇవ్వనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనీ జరగని పరిస్థితి నెలకొందన్నారు. యువకులు అధికంగా పార్టీలోకి చేరడంతో మరింత పటిష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ప్రభాకర్, శ్రీనాథ్, రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


