బెళగావికి బైబై
సాక్షి బెంగళూరు: కుందానగరి బెళగావి సువర్ణసౌధలో రెండు వారాలుగా జరుగుతున్న రాష్ట్ర విధాన మండల ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఒకవైపు ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరిగిన పోటీ, డిన్నర్ మీటింగ్‌లు, వివిధ సంఘాల ఆందోళనల మధ్య శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగిన సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలతో పాటు వివిధ తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల వల్ల బెళగావికి ఒక్కసారిగా రాజకీయ నాయకులు, అధికారులు, ఇతరులు వచ్చి చేరడంతో పర్యాటక, యాత్రా స్థలాలు కిక్కిరిసిపోయాయి. డిసెంబర్ 8న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. పది రోజుల్లో రెండు రోజులు దివంగత ఎమ్మెల్యేలు హెచ్.వై.మేటి, శామనూరు శివశంకరప్పలకు సంతాపం వ్యక్తం చేసి కార్యకలాపాలను వాయిదా వేశారు. ఇటీవల మరణించిన ఇతర ప్రముఖులకు కూడా సమావేశాల ప్రారంభంలో శ్రద్ధాంజలి ఘటించారు. మిగిలిన 8 రోజుల్లో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో సలహా సూచనలిచ్చారు.
జీరో అవర్‌లో వివిధ అంశాలపై చర్చ
జీరో అవర్‌లో వివిధ అంశాలను ప్రస్తావించి ప్రభుత్వం నుంచి పరిష్కారం కోసం నేతలు శ్రమించారు. ఉత్తర కర్ణాటక జలవనరుల ప్రాజెక్టులతో పాటు వివిధ రకాల అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు వరకు ఉన్న పెండింగ్ బకాయిలన్నింటిని చెల్లించిందని మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలు ఒక అడుగు ముందుకేసి ఫిబ్రవరి, మార్చి నెలల డబ్బులు విడుదల కాలేదని నిరూపించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య కలుగజేసుకుని ఆ రెండు నెలల డబ్బులను త్వరగా అందిస్తామని హామీనివ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత మంత్రి కూడా తాను చేసిన తప్పునకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిధుల వినియోగ బిల్లు, ద్వేషప్రసంగాల నియంత్రణ బిల్లు, అంతర్గత రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు తదితర బిల్లులకు విధానసభలో ఆమోదం లభించింది.
ముగిసిన అసెంబ్లీ
శీతాకాల సమావేశాలు
పది రోజుల పాటు బెళగావిలోనే
నాయకులు, అధికారుల మకాం


