నేనే సీఎం...అలాగని రాసిచ్చారా? | - | Sakshi
Sakshi News home page

నేనే సీఎం...అలాగని రాసిచ్చారా?

Dec 21 2025 12:35 PM | Updated on Dec 21 2025 12:35 PM

నేనే

నేనే సీఎం...అలాగని రాసిచ్చారా?

శివాజీనగర: అసెంబ్లీలో చివరిరోజు శుక్రవారం సీఎం సిద్ధరామయ్య, ప్రతిపక్ష నేత అశోక్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. మున్ముందూ తానే సీఎంగా కొనసాగుతానని సీఎం సిద్ధు అనగా..అలాగని రాసిచ్చారా అంటూ అశోక్‌ కౌంటరిచ్చారు. ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ రెండున్నరేళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి స్థానం అనే నిర్ణయం కాలేదని, కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ తీర్మానిస్తే మున్ముందు కూడా తానే కొనసాగుతానని, హైకమాండ్‌ తనకు అండగా ఉందని అన్నారు. ఇందుకు ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక్‌ జోక్యం చేసుకుంటూ .. ‘మేమంతా బ్రహ్మ వద్ద ఎక్కువ సేపు ఉండకుండా విడిచి వచ్చేశాం. సిద్ధరామయ్య మాత్రం బ్రహ్మ వద్ద కూర్చొని 2013 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలూ ముఖ్యమంత్రిగా ఖరారు చేసుకుని రాయించుకుని వచ్చారు. ప్రస్తుతం మాత్రం రెండున్నర సంవత్సరాలు రాసిచ్చార’ంటూ ఎద్దేవా చేశారు. ఇది మీకు ఎలా తెలిసిందని సిద్ధు ప్రశ్నించగా... ‘మీరు అధికార మార్పిడి గురించి ఢిల్లీ విమానం ఎక్కి వెళ్లిన నాటి నుంచి తీర్మానం అయ్యే వరకు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి నాకు ఫోన్‌ ద్వారా సమాచారం వస్తుండేది. మీకు రెండున్నరేళ్లనని గడువు రాశారు. దానితో సరిపెట్టుకోవాలి’ అని అన్నారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య తమది హైకమాండ్‌ ఉన్న పార్టీ అని, తొలిసారి కాలావధికి ఐదేళ్లు అధికారాన్ని పూర్తి చేశానని, ప్రస్తుతం హైకమాండ్‌ తనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇన్ని సమస్యల మధ్య కూడా మీరు సమర్థించుకోవటాన్ని మెచ్చుకోవాలని బీజేపీ సభ్యులు అరగ జ్ఞానేంద్ర, వి.సునీల్‌కుమార్‌ తదితరులు ఎద్దేవా చేశారు. బీజేపీలో యడియూరప్పను అధికారం నుంచి తొలగించింది ఎందుకని సిద్ధు ప్రశ్నించారు. అశోక్‌కు ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు పూర్తి చేసే విశ్వాసముందా అని సవాల్‌ చేశారు. అశోక్‌ ఐదేళ్లూ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారని, ఆ విషయంలో తమకు గ్యారెంటీ ఉందని, మీకు ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటాననే విశ్వాసం ఉందా అని సునీల్‌కుమార్‌ ప్రశ్నించారు. ‘శాసనసభా పార్టీ సమావేశంలో నన్ను ఎంపిక చేశారు. అదే ప్రకారం ముఖ్యమంత్రి అయ్యా. హైకమాండ్‌ తీర్మానించినట్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. రెండున్నరేళ్లు అంటూ మాలో ఎలాంటి తీర్మానమూ కాలేద’ని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. మంత్రి కేజే జార్జ్‌ మాట్లాడుతూ తమ పార్టీ విషయాలు బీజేపీ వారికి ఎందుకని ప్రశ్నించారు. సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌వీ దేశ్‌పాండే మాట్లాడుతూ రెండున్నరేళ్లలో అధికార మార్పిడి అంటూ తీర్మానం కాలేదు.. అనవసరమైన చర్చ ఎందుకన్నారు.

అసెంబ్లీలో సీఎం సిద్ధు, ప్రతిపక్ష నేత అశోక్‌ మాటల యుద్ధం

నేనే సీఎం...అలాగని రాసిచ్చారా?1
1/1

నేనే సీఎం...అలాగని రాసిచ్చారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement