ఆ జన్యువులోనే కోవిడ్‌ మరణాల గుట్టు! 

Corona Virus: Genetic Variant Issue In Human Body - Sakshi

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మందిని బలితీసుకుంది. కొన్నిదేశాల్లో ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. ఈ వైరస్‌ బారినపడి చనిపోయినవారిలో.. పెద్దవయసువారు, వివిధ వ్యాధులున్నవారే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మధ్యవయసువాళ్లు, యువత కూడా ఉన్నారు. మరి ఇలా ఏ అనారోగ్యం లేకుండా నిక్షేపంగా ఉన్నవారు కూడా కోవిడ్‌తో చనిపోవడానికి వారిలో జన్యు వ్యత్యాసమే (జీన్‌ వేరియేషన్‌) కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతకీ ఆ జన్యువు ఏమిటి, ఎందుకు ప్రాణాల మీదికి వస్తోంది, పరిశోధనలో తేలిన వివరాలివి.. 

ఊపిరితిత్తుల కణాల్లో.. 
సాధారణంగా పిల్లలు, యువతతోపాటు 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ఎక్కువగా ఉంటుంది. 60 ఏళ్లు దాటినవారిలో వయసు పెరిగినకొద్దీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కానీ కోవిడ్‌ బారినపడి చనిపోయినవారిలో 30ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసువారు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జీనోమిక్స్‌ విభాగం శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.

తీవ్రస్థాయిలో కోవిడ్‌కు గురై ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారు, తక్కువగా ప్రభావితమైన వారి జన్యుక్రమాన్ని పోల్చి చూశారు. మన ఊపిరితిత్తుల కణాల్లో ఉండే ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్‌1’ అనే జన్యువులోని ఒక వేరియేషన్‌ కరోనా మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణమని గుర్తించారు. 

ఏమిటీ ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్‌1’? 
ఊపిరితిత్తుల కణాలగోడలు దృఢంగా ఉండటానికి, వైరస్‌ల దాడిని ఎదుర్కొని, కణాలు తిరిగి బలం పుంజుకోవడానికి ఈ జన్యువు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ జన్యువులో రెండు రకాలు (వేరియంట్లు) ఉన్నాయని.. అందులో ఒకరకం కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తోడ్పడితే.. మరో రకానికి ఈ శక్తి తక్కువగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు.

ఇలా తక్కువ శక్తి ఉన్న రకం జన్యువు.. దక్షిణాసియా దేశాల వారిలో 60 శాతం, యూరోపియన్‌ దేశాల్లో 15 శాతం, ఆఫ్రికా వారిలో 2.4 శాతం, తూర్పు ఆసియా దేశాల వారిలో 1.8 శాతం ఉన్నట్టు తేలిందని వివరించారు. 

‘రిస్క్‌’ రెండింతలు.. 
ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా మన శరీరంలో నేరుగా ఎక్కువ ప్రభావం పడిన జన్యువు ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్‌1’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ జేమ్స్‌ డేవిస్‌ చెప్పారు. అయితే కేవలం ఈ ఒక్క జన్యువు కారణంగానే పెద్ద సంఖ్యలో మరణాలు నమోదైనట్టు చెప్పలేమని.. మధుమేహం, గుండెజబ్బులు వంటివి
ఉన్నవారిలో తక్కువ శక్తి ఉన్న జన్యువు ఉంటే.. మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.

భారతదేశంలో టైప్‌–2 మధుమేహం,గుండె జబ్బుల బాధితులు ఎక్కువని.. దానికితోడు తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్‌1’ జన్యువు ఉన్నవారి సంఖ్య కూడా ఎక్కువేనని జేమ్స్‌ డేవిస్‌ తెలిపారు. ఈ రెండింటి కారణంగానే కరోనా రెండో వేవ్‌ సమయంలో భారతదేశంలోని కొన్నిప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. 

వయసు పెరిగిన కొద్దీ.. 
తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్‌1’ జన్యువు ఉన్నవారు.. తమకంటే పదేళ్లు ఎక్కువ వయసున్న వారితో సమానంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు లోనవుతారని ప్రొఫెసర్‌ జేమ్స్‌ డేవిడ్‌ వెల్లడించారు. అలాంటి వారిలో 20–30 ఏళ్ల తర్వాత ప్రతి పదేళ్లకు ప్రమాద అవకాశం రెండింతలు అవుతూ ఉంటుందని వివరించారు.

అయితే తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్‌1’ జన్యువు ఉన్నంత మాత్రాన ప్రమాదకరమని అనుకోవద్దని.. ఇతర జన్యువులు, రోగ నిరోధక శక్తి, ఎలాంటి వ్యాధులు లేకపోవడం వంటివి రక్షణగా ఉంటాయని స్పష్టం చేశారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top