టీకా రక్ష.. అందని ద్రాక్ష?

Corona Vaccine Shortage In  Karnataka - Sakshi

కర్ణాటకలో వ్యాక్సిన్లకు తీవ్ర కొరత

అంతటా పొడవైన క్యూలు

4.22 కోట్ల మందికి బాకీ  

శివాజీనగర: కోవిడ్‌ రెండో దాడితో నలిగిపోయిన కన్నడనాట కరోనా టీకాలు అందనిమావిగానే మిగిలిపోతున్నాయి. రాష్ట్రమంతటా 18 ఏళ్లు పైబడిన 5.11 కోట్ల మంది కరోనా టీకాలకు అర్హులు కాగా వారిలో 82 శాతం మందికి ఇప్పటికీ సూదిమందు ఇవ్వలేదు. టీకా అభియాన్‌ ప్రారంభమైన జనవరి నుంచి బుధవారం వరకు 1.14 కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్లు సర్కారు తెలిపింది. మరో 4.22 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉండగా అభియాన్‌ ముందుకు సాగడం లేదు. 

రెండో డోసే అందలేదు.. 
66.4 లక్షల మంది రెండో డోస్‌కు నిరీక్షిస్తున్నారు. అభియాన్‌ను వేగవంతం చేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కోవిడ్‌ వారియర్స్‌ 8.6 లక్షలు కాగా, వారిలో ఇప్పటి వరకు 4,60,437 మందికి మాత్రమే రెండు డోస్‌ల టీకాలు లభించాయి. 1.6 లక్షల మందికి తొలి డోసే దొరకలేదు. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 1.5 లక్షల డోస్‌ల కోవాగ్జిన్, 6.5 లక్షల డోస్‌లు కోవిషీల్డ్‌ టీకాలు మాత్రమే స్టాక్‌ ఉంది. టీకాల్లో సర్కారు లెక్కలు దారితప్పాయని నిపుణులు తెలిపారు.

నవంబర్‌కల్లా 100 శాతం టీకాలు
రాష్ట్రంలో నవంబర్‌ నాటికి రెండు డోస్‌ల కోవిడ్‌ టీకాలను 100 శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు వైద్య ఆరోగ్య సుధాకర్‌ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు 1,22,20,510 డోస్‌లు వచ్చినట్లు చెప్పారు. 1,13,61,234 మందికి టీకాలు ఇచ్చినట్లు బుధవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9,50,000 కోవిషీల్డ్, 1,44,174 కోవాగ్జిన్‌ టీకాలను కొనుగోలు చేసిందన్నారు. స్పుత్నిక్‌ టీకాను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే అవకాశముందని తెలిపారు. కోవిడ్‌ డిశ్చార్జ్‌లు పెరగడం ఆశాజనకమన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top