కరోనా హెచ్చరిక: వచ్చే 4 వారాలు అత్యంత సంక్లిష్టం 

Corona Alert: Central Govt Warned Next Four Weeks Extremely Complicated - Sakshi

అందరికీ వ్యాక్సినేషన్‌కు ఇది సమయం కాదు  

దేశవ్యాప్తంగా ఒకే రోజు 96,982 కేసులు నమోదు  

ముంబైలో రాత్రి 8 నుంచి బీచ్‌లు, పార్కులు బంద్‌

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా పెరిగిపోతోందని, వచ్చే నాలుగు వారాలు అత్యంత సంక్లిష్టమైనని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సెకండ్‌ వేవ్‌ని కట్టడి చేయడం ప్రజల చేతుల్లోనే ఉందని హితవు పలికింది. ప్రజలందరూ కోవిడ్‌ నిబంధనలన్నీ పాటిస్తూ కరోనా కొమ్ములు వంచడానికి యుద్ధం చేయాలని పిలుపునిచ్చింది. కరోనా పరీక్షల సామర్థ్యం, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పన, వాయువేగంగా వ్యాక్సినేషన్‌ వంటి చర్యల్ని కేంద్రం తీసుకుంటోందని, ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతున్నాయని, మరో 4వారాలు ప్రజలందరూ జాగరూకతతో ఉండాలన్నారు.  

అందరికీ వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో కుదరదు 
18 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో జరిగే పని కాదని కేంద్రం తేల్చి చెప్పింది. కరోనా ప్రభావం ఎవరిపై ఎక్కువ ఉంటుందో వారికే ముందుగా ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు. టీకా ఎవరు అడిగితే వారికి ఇవ్వకూడదని, ఎవరికి అవసరమో వారికి ఇవ్వడమే లక్ష్యంగా ఉండాలన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్, మహారాష్ట్ర సీఎం ఠాక్రే వ్యాక్సిన్‌ వయసు నిబంధనల్ని సడలించాలని కేంద్రాన్ని కోరారు. వీరి ప్రతిపాదనలను కేంద్రం ప్రస్తుతానికి తోసిపుచ్చింది. కరోనా కట్టడికి 45 ఏళ్ల పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని చెప్పింది.  

అత్యధిక కేసులు వస్తున్న 10 జిల్లాలు ఇవే 
కరోనా కేసులు అత్యధికంగా వస్తున్న జిల్లాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ చేరింది. మహారాష్ట్ర నుంచి ఏడు, కర్ణాటక నుంచి ఒక జిల్లా, ఢిల్లీ టాప్‌ టెన్‌ జాబితాలో ఉన్నాయి. పుణె, ముంబై, థానే, నాగ్‌పూర్, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, అహ్మద్‌నగర్, ఢిల్లీ, దుర్గ్‌ల నుంచి అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.  

ఒకే రోజు 96,982 కేసులు  
దేశంలో వరుసగా మూడో రోజు 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 96,982 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 26 లక్షల 86 వేల49కి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది. మరో 446 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 1,65,547కి చేరుకుంది. లక్షా 3వేల 558 కేసులతో ఆల్‌ టైమ్‌ హైకి చేరుకున్న మర్నాడు కూడా 97 వేలకు చేరువగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  

మహారాష్ట్రని కరోనా ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. రోజూ 47 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండడంతో ఆంక్షల్ని కఠినతరం చేయాల్సి వచ్చింది. ముంబైలో ఒకే రోజు 10 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటలవరకు బీచ్‌లు, పార్కుల్లో సందర్శకులకు అనుమతిపై నిషేధం విధించారు. పుణె జిల్లాలో ఒకే రోజు 8,075 కేసులు వెలుగులోకి రావడంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ముంబైలో ఆంక్షలు తీవ్రతరం కావడంతో వలస కార్మికులు ఉపాధి కోల్పోయి ఊరి బాట పట్టారు. రైళ్లు నిలిపివేస్తే కాలి నడకన వెళ్లాల్సి వస్తుందన్న భయంతో మూట ముల్లె సర్దుకొని స్వగ్రామాలకు తరలిపోతున్నారు. 

ఢిల్లీలో నైట్‌ కర్ఫ్యూ 
ఢిల్లీలో అనూహ్యంగా కేసులు పెరిగిపోతూ ఉండడంతో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్‌ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) నగరంలోని పరిస్థితులు సమీక్షించి ఆంక్షలు అత్యవసరం అని చెప్పడంతో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని కేజ్రివాల్‌ సర్కార్‌ నిర్ణయించింది.  
పెళ్లిళ్లు, అంత్యక్రియలు మినహా అన్ని రకాల కార్యక్రమాలపై పంజాబ్‌ నిషేధం విధించింది. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న 11 జిల్లాల్లో ఈ ఆంక్షల్ని అమలు చేసింది. పెళ్లయినా, చావైనా 20 మందికి మించి రావడానికి అనుమతిలేదు. ఇక చండీగఢ్‌లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.  
రాజస్థాన్‌లో రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి హోండెలివరీకి మాత్రమే అనుమతి ఉంది. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు బడుల్ని బంద్‌ చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top