పునర్విభజనతో ప్రజా ఉద్యమం! | CM Revanth Reddy Key Meeting In Delhi | Sakshi
Sakshi News home page

పునర్విభజనతో ప్రజా ఉద్యమం!

Apr 11 2026 1:07 AM | Updated on Apr 11 2026 1:07 AM

CM Revanth Reddy Key Meeting In Delhi

సీడబ్ల్యూసీ సమా­వేశంలో రాహుల్, ఖర్గే, వేణుగోపాల్, రేవంత్, ప్రియాంక

లోక్‌సభ సీట్ల పెంపుతో రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాలు పెరుగుతాయి

ఈ బిల్లును అడ్డుకోవాల్సి వస్తే నేను కాదు ప్రజలే తిరగబడతారు

ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ నియోజకవర్గాల పెంపు (పునర్విభ­జన)­తో రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాలు పెరుగుతాయని, ఫలితంగా ప్రజా ఉద్యమాలు తప్పవని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చిరించారు. రైతు చట్టాల్లాగే డీలిమిటేషన్‌ బిల్లును కూడా వెనక్కి తీసుకోకతప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్ర­భు­త్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర ద్రోహం చేస్తోందని అన్నా­రు. ఈ రాష్ట్రాలను రాజకీయంగా అణగదొక్కే కుట్ర జరుగు­తోందని మండిపడ్డారు. ఇది పార్టీల సమస్య కాదని, ప్రాంతా­ల సమస్య అని చెప్పారు. ‘ఇప్పటికే మేము తీవ్రమైన బాధతో ఉన్నాం.. గాయపడి ఉన్నాం.. మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దు’ అని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమా­వేశానికి హాజరైన అనంతరం.. రాత్రి తన అధికారిక నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

అప్పుడు బండి, కిషన్‌రెడ్డిలకు చప్రాసీ పదవి కూడా దొరకదు
‘నియోజకవర్గాలను ఏ ప్రాతిపదికన, ఎలా పెంచాలి అనే దా­ని­పై కనీస చర్చ లేకుండా ఎందుకింత అర్జెంటుగా? దేశంలో 50 శాతం నియోజకవర్గాల పెంపు జరిగితే ఉత్తరాదికే పూర్తి అడ్వాంటేజ్‌గా మారుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దుస్థితి వస్తుంది. చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా ప్రా­ము­ఖ్యత కోల్పోతాయి. చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారిపోతాయి. ఆర్థిక ప్రాతిపది­కన, మెరిట్‌ డిజబిలిటీ  విధానంలో అసెంబ్లీ, లోక్‌సభ ని­యో­జకవర్గాల పెంపు ఉండాలి.

చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రా­ల మధ్య ఇప్పుడున్న గ్యాప్‌ అలాగే కొనసాగాలి. ప్రస్తుతం కేరళ, యూపీ మధ్య 60 సీట్ల తేడా ఉంది. పునర్విభజన జరిగితే అది ఏకంగా 99కి పెరుగుతుంది. ఇది ముమ్మాటికీ చిన్న రాష్ట్రాలకు ఉరితాడు లాంటిదే. భవిష్యత్తులో ఉత్తరాది సీట్లు పెరిగితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్, కిషన్‌­రెడ్డి లాంటి దక్షిణాది బీజేపీ నేతలకు కనీసం చప్రాసీ పదవి కూడా దొరకదు..’ అని సీఎం అన్నారు.

అందమైన ముసుగులో మోసం
‘నియోజకవర్గాల పెంపు అనేది అందమైన ముసుగులో చేస్తు­న్న మోసం. బీజేపీ పెడుతున్న ఈ మెలికల్లో వారి రాజకీయ స్వార్థం దాగుంది. గతంలో ఇలాగే హడావుడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారు. రైతుల ఆందోళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈ బిల్లుపై సౌత్‌లో రియాక్షన్‌ వస్తే, బీజేపీ పాలిత చిన్న రాష్ట్రాలు సహా.. ఇతర చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే కేంద్రం ఏం చేస్తుంది? ఈ బిల్లును అడ్డుకోవాల్సి వస్తే నేను కాదు ప్రజలే తిరగబడతారు.

మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు..
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ అమలు చేశారు. సోనియాగాంధీ గతంలోనే మహిళా రిజర్వే షన్‌ బిల్లును పెట్టారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల కోసం సీట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 181 సీట్లను మహిళలకు కేటాయించి రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా? కేంద్రం లీకులు ఇస్తున్న ఇతర సవరణలపై ఇండియా కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించాం..’ అని రేవంత్‌ తెలిపారు.

కేటీఆర్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు 
కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లకు అవమానం జరిగిందని బీఆర్‌­ఎస్‌ నేత కేటీఆర్‌ మాట్లాడటం సిగ్గుచేటని రేవంత్‌రెడ్డి విమ­ర్శిం­చారు. ‘గతంలో బీఆర్‌ఎస్‌లో సీనియర్లుగా ఉన్న ఆలె న­రేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్, విజయ­శాంతి లాంటి ఎంతోమందికి ఏం జరిగిందో, వారిని ఎలా గెంటే­శా­రో అందరికీ తెలుసు..’ అని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement