సీఎం స్టాలిన్‌ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..

CM MK Stalin Visit Hospital Inquired about Dania Health Conditions - Sakshi

సాక్షి, చెన్నై: అంతుచిక్కని వ్యాధితో పోరాడుతూ శస్త్ర చిక్సిత అనంతరం సవిత ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న చిన్నారి డానియాను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరామర్శించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి వీరాపురంలోని శ్రీవారి నగర్‌ ప్రాంతానికి చెందిన స్టీఫెన్‌రాజ్, సౌభాగ్య దంపతులకు 2012లో వివాహం జరిగింది. వీరికి డానియా అనే కుమార్తెతో పాటు ఓ కుమారుడు ఉన్నాడు. డానియా వీరాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.

బాలిక ముఖంపై నల్లమచ్చలు రావడంతో చిన్నారి అంతుచిక్కని వ్యాధికి గురైంది. మొదట సాధారణ రక్తం గడ్డగానే భావించి ఎగ్మోర్‌ చిన్నపిల్లల వైద్యశాలకు తీసుకెళ్లి చిక్సిత అందించారు. గత ఆరేళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల చుట్టూ తిరిగినా రోగం నయం కాలేదు. రోజులు గడిచే కొద్ది డానియా కుడికన్ను, దవడ, పెదవికి ఒక వైపు పూర్తిగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. దీంతో డానియా సీఎం స్టాలిన్‌ అంకుల్‌–ఆదుకోండి అంటూ చేసిన విజ్ఞప్తి చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో సీఎం వెంటనే బాలిక పరిస్థితిపై పూర్తి నివేదికను తెప్పించుకుని వైద్యసేవలను అందించాలని సూచించారు. స్థానిక మంత్రి నాజర్‌ బాలిక కుటుంబానికి తక్షణ సాయం అందించడంతో పాటు సవిత వైద్యశాలలో బాలిక అపరేషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు. పూందమల్లి సవిత వైద్యశాల ఈనెల 23న విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తి చేసింది. ఇటీవల ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు బాలికను మార్చారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేరుగా సవిత వైద్యశాలకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ‘‘ఆపరేషన్‌ విజయవంతమైంది. భయపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే పాఠశాలకు వెళ్లొచ్చు. భవిషత్‌లోనూ వైద్యసేవలు అవసరమైతే సాయం అందిస్తాం’’ అని సీఎం బాలికకు భరోసా ఇచ్చారు.

చదవండి: (భర్తతో గొడవ.. ఆస్పత్రిలో చేరిన జయలలిత మేనకోడలు దీప)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top