
బరేలీలో పోలీసులతో స్థానికుల ఘర్షణ
బరేలీ: ‘ఐ లవ్ మహ్మద్’కార్యక్రమానికి మద్దతుగా చేపట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఇత్తెహాద్–ఇ–మిల్లత్ కౌన్సిల్ చీఫ్, మత పెద్ద తౌకీర్ రజా ఖాన్ చేసిన ప్రకటన యూపీలో బరేలీలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఒక మసీదు వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇందుకు కారకులుగా గుర్తించిన డజను మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఏదేమైనా ర్యాలీని నిర్వహిస్తామంటూ గురువారం ప్రకటించిన రజా ఖాన్.. అధికారులు అనుమతి ఇవ్వనందున ర్యాలీని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రకటించారు. దీంతో, ‘ఐ లవ్ మహ్మద్ అని రాసిన పోస్టర్లను చేబూనిన జనం పెద్ద సంఖ్యలో కొత్వాలీ ఏరియాలోని రజా ఖాన్ నివాసం, మసీదు వద్ద గుమికూడారు.
ప్రదర్శనను వాయిదా వేయడంపై ఆగ్రహంతో ఇస్లామియా ఇంటర్ కాలేజీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయతి్నంచగా అడ్డుకున్నాం. దీంతో రాళ్లు రువ్వుతూ, వాహనాలు, దుకాణాలపై దాడులకు పాల్పడ్డారు. వారిని చెదరగొట్టాం’అని పోలీసు అధికారులు తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇత్తెహాద్–ఇ–మిల్లత్ కౌన్సిల్‌ను అహ్మద్ రజా ఖాన్ ఏర్పాటు చేశారు. దక్షిణాసియాలో ఎక్కువ ప్రభావం కలిగిన సున్నీ ఇస్లాంలోని బెరేల్వీ వర్గాన్ని స్థాపించింది ఈయనే. ఈయన వారసుడే తౌకీర్ రజా ఖాన్. కాగా, ‘ఐ లవ్ మహ్మద్’నినాదంలో ఎలాంటి తప్పూ లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.