సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్టాన్ని త్వరగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు అఖిలపక్ష భేటీకి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారితో చర్చించాకే ప్రత్యేక సమావేశాల్లో ఈ చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తున్న ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నారీ శక్తి వందన్ అధినియమ్(మహిళా రిజర్వేషన్ చట్టం)–2023 ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేయనున్నారు.
జన గణన, నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియల తర్వాతే మహిళా కోటా అమలు చేయాలని ఆ చట్టంలో నిర్దేశించారు. అయితే నియోజకవర్గాల పునరి్వభజన ఇంకా పూర్తికాకపోవడంతో ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2027–28లో జరగాల్సిన పునర్విభజన ప్రక్రియ నుంచి ఈ చట్ట అమలును వేరుచేసి త్వరగా అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం రెండు సవరణలు చేయాలని భావిస్తోంది. ఈ సవరణల ఆమోదం కోసం ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహిళలకు రిజర్వేషన్ అమలు విధివిధానాలపై చర్చించేందుకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లేఖలో కోరిన సంగతి తెలిసిందే. ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.
దృష్టిమరల్చేందుకే ఇదంతా చేస్తోంది: కాంగ్రెస్ ఆరోపణ
దేశంలో ఎల్పీజీ, ఇంధన సంక్షోభం తలెత్తడంతో ఈ అంశాల నుంచి ప్రజలను దృష్టిమరల్చేందుకే మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టం తక్షణ అమలు అంశాన్ని తెరమీదకు తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు పార్టీ ప్రధానకార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ మాట్లాడారు. ‘‘రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిన నాడే వెంటనే అమలుచేయాలని మేం కోరాం. కానీ అది అసాధ్యమని మోదీ తేల్చిచెప్పారు. తీరా ఇప్పుడు ఇంధన సంక్షోభం, విదేశాంగ విధానం విఫలమవడంతో యూటర్న్ ఉస్తాద్(మోదీ) మాటమార్చాడు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు 30 నెలల తర్వాత హఠాత్తుగా మహిళారిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు’’అని జైరాం అన్నారు.


