రీల్‌ కూడా వార్తే.. | Center proposes amendments to IT rules | Sakshi
Sakshi News home page

రీల్‌ కూడా వార్తే..

Apr 6 2026 4:08 AM | Updated on Apr 6 2026 12:52 PM

Center proposes amendments to IT rules

ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి ఇన్‌ఫ్లుయెన్సర్లు 

ఐటీ నిబంధనలకు సవరణలు ప్రతిపాదించిన కేంద్రం 

అమలైతే పోస్ట్‌ చేసే ప్రతి విషయంపై పెరగనున్న నిఘా

వార్తలు, రాజకీయ సంబంధ అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారా? రానున్న రోజుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఐటీ నిబంధనలు–2021కి కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఇవి కార్యరూపంలోకి వస్తే యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కూడా ప్రచురణకర్తలుగా పరిగణిస్తారు. అంటే వారు పోస్ట్‌ చేసే ప్రతి విషయంపై ప్రభుత్వ నిఘా, బాధ్యత పెరుగుతుంది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్

క్రియేటర్లూ జాగ్రత్త..
వార్తలు, రాజకీయ సంబంధ పోస్టులను పంచుకునే యూట్యూ బర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇప్పటివరకు ప్రభుత్వం వార్తా సంస్థలుగా గుర్తించలేదు. దీనివల్ల టీవీ చానెళ్లకు ఉండే కఠిన నిబంధనలు వీరికి ఉండేవి కావు. ప్రతిపాదిత కొత్త సవరణల ప్రకారం ఏదైనా కంటెంట్‌ను ‘తప్పు’అని ప్రభుత్వం భావిస్తే.. దాన్ని వెంటనే తొలగించే అధికారం ప్రభుత్వానికి పెరుగుతుంది. అంటే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేటప్పుడు క్రియేటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  

ఏమిటీ కొత్త ప్రతిపాదన? 
సమాచార సాంకేతికత (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా నైతిక నియమావళి) రెండో సవరణ నిబంధనలు–2026 కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్‌ 14 వరకు ప్రజల అభిప్రాయాలను కోరింది. 

సురక్షితమైన ఇంటర్నెట్‌ను నిర్మించడమే దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతుండగా.. విమర్శకులు మాత్రం ఇది సామాన్యుల డిజిటల్‌ వాక్‌ స్వాతంత్య్రంపై ప్రభుత్వానికి అపరిమితమైన కొత్త అధికారాలను కట్టబెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ ఈ ముసాయిదా నిబంధనలను డిజిటల్‌ నియంతృత్వంగా అభివర్ణించింది. 

పరిధిలోకి ఎవరు వస్తారు? 
ఈ సవరణలు యూట్యూబర్లు, ఇన్‌స్ట్రాగామ్‌ రీల్స్‌ క్రియేటర్లు, ‘ఎక్స్‌’యూజర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లతో సహా ప్రైవేట్‌ వ్యక్తులు పోస్ట్‌ చేసే వార్తలు, రాజకీయ అభిప్రాయాలతో కూడిన కంటెంట్‌ ఐటీ నిబంధనలలోని ‘పార్ట్‌–3’పరిధిలోకి వస్తాయి. గతంలో వృత్తిపరమైన మీడియా సంస్థలకు మాత్రమే పరిమితమైన మూడంచెల పర్యవేక్షణ విధానం ఇకపై వీరికి కూడా వర్తిస్తుంది.

కొత్త నిబంధన ఏమిటి? 
ప్రభుత్వం జారీ చేసే లిఖితపూర్వక వివరణలు, సలహాలు, ఉత్తర్వులు, మార్గదర్శకాలను సోషల్‌ మీడియా సంస్థలు కచ్చితంగా పాటించాలి. ఏదైనా ప్లాట్‌ఫాం నిరాకరిస్తే వాటికి ఉన్న ‘సేఫ్‌ హార్బర్‌’రక్షణను ప్రభుత్వం రద్దు చేస్తుంది. సాధారణంగా సోషల్‌ మీడియాలో ఎవరో ఒకరు తప్పుడు పోస్ట్‌ పెడితే దానికి ఆ సంస్థను బాధ్యులను చేయకూడదనేది సేఫ్‌ హార్బర్‌ నిబంధన ఉద్ధేశం. ఈ రక్షణ పోతే యూజర్లు చేసే ప్రతి తప్పుకు లేదా పెట్టే ప్రతి వివాదాస్పద పోస్ట్‌కు సదరు కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనివల్ల కోర్టు కేసులు, భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ఎంత సమయంలో తొలగించాలి? 
నోటీసు అందిన 2–3 గంటల్లో ప్లాట్‌ఫాంలు సదరు కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. 2021 నిబంధనల ప్రకారం గతంలో ఉన్న 24–36 గంటల సమయ పరిమితితో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పు.

విస్తృత చర్యల్లో భాగమా? 
ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం డీప్‌ఫేక్స్, ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్‌పై కొన్ని నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం అలాంటి కంటెంట్‌ ఏఐతో రూపుదిద్దుకుందని లేబుల్‌ వేయడం, ఫిర్యాదు వచ్చిన వెంటనే త్వరగా తొలగించడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు వస్తున్న కొత్త ఐటీ ప్రతిపాదన దీనికి తదుపరి దశ. ఆన్‌లైన్లో ప్రజలు మాట్లాడే లేదా పెట్టే పోస్టులపై ప్రభుత్వ పర్యవేక్షణను మరింత పటిష్టం చేయడం దీని ప్రధాన లక్ష్యం.  

Advertisement
 
Advertisement
Advertisement