Demolition of Carnac Bridge: కాలగర్భంలోకి 154 ఏళ్ల నాటి వంతెన

British Era Carnac Bridge Demolished In Less Than Stipulated Time - Sakshi

సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టర్మీనస్‌ (సీఎస్‌ఎంటీ)– మసీద్‌ బందర్‌ స్టేషన్ల మధ్యనున్న 154 ఏళ్ల పురాతనమైన కర్నాక్‌ వంతెన కాలగర్భంలో కలిసిపోయింది. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే సోమవారం తెల్లవారుజాము రెండు గంటల వరకు 27 గంటలు జంబో బ్లాక్‌ తీసుకున్నప్పటికీ 16 గంటల్లోనే కూల్చీవేత పనులు పూర్తిచేశారు. ఆ తరువాత సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగారు. 25 వోల్టేజీల విద్యుత్‌ ప్రవహించే ఓవర్‌ హెడ్‌ వైరు, సిగ్నల్స్, ఇతర సాంకేతిక పనులు సరిచేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి లోకల్‌ రైళ్ల రాకపోకలు మెల్లమెల్లగా పునరుద్ధరించారు.

ఎట్టకేలకు 19 గంటల తరువాత సెంట్రల్‌ రైల్వే మార్గంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఎస్‌ఎంటీ నుంచి థానే దిశగా, హార్బర్‌ మార్గంలో మొదటి రైలు 5.52 గంటలకు సీఎస్‌ఎంటీ నుంచి పన్వేల్‌ దిశగా నెమ్మదిగా బయలు దేరింది. బ్లాక్‌ కారణంగా సోమవారం ఉదయం ముంబైకి చేరుకోవల్సిన అనేక దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాలేకపోయాయి. దీంతో కొన్ని రైళ్లు సోమవారం కూడా రద్దయ్యాయి.  

సిబ్బందికి సెలవులు రద్దు... 
జంబో బ్లాక్‌ కారణంగా శని, ఆదివారాలు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌), రైల్వే పోలీసులు, ముంబై పోలీసుల వారంతపు సెలవులు రద్దు చేశారు. సాధారణంగా ప్రతీరోజు సెంట్రల్‌ రైల్వే మార్గంలో ప్రతీరోజు 1,810 లోకల్‌ రైళ్లు తిరుగుతాయి. కాని జంబో బ్లాక్‌ కారణంగా ఆదివారం 1,096 ట్రిపులు రద్దయ్యాయి. అదేవిధంగా 36 దూరప్రాంతాల మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దుచేయగా 68 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దాదర్‌ టర్మీనస్, లోకమాన్య తిలక్‌ (కుర్లా) టర్మీనస్, థానే, కల్యాణ్, కసారా, నాసిక్, కర్జత్, పుణే తదితర ప్రధాన స్టేషన్లలో రద్దుచేసి అటునుంచి తిరిగి పంపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శని, ఆదివారాలు 27 గంటలపాటు జంబో బ్లాక్‌ తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేటు వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్ధలకు, సెలవు ఉంటుంది.

దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్ధులు ఇబ్బందులు పడరు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయట పడవద్దని రైల్వే అధికారులు సూచనలు సైతం జారీ చేశారు. కానీ ప్రస్తుతం పెళ్లిల సీజన్‌ కావడంతో అనేక మంది ఆదివారం షాపింగులకోసం ఇళ్ల నుంచి బయటపడ్డారు. జంబో బ్లాక్‌ విషయం తెలియక కొందరు పర్యాటకులు రోడ్డు మార్గం ద్వారా ముంబైకి చేరుకున్నారు. కాని ముంబైకి చేరుకున్నాక ఇబ్బందులు పడక తప్పలేదు. అనేక లోకల్‌ రైళ్ల ట్రిప్పులు రద్దు కావడంతో ప్రధాన స్టేషన్ల ప్లాట్‌ఫారాలపై ఇసుకపోస్తే రాలనంత జనాలు ఉన్నారు. ప్రయాణికులను నియంత్రించడానికి రైల్వే పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చింది.

ముఖ్యంగా బైకళ, వడాల రోడ్‌ స్టేషన్‌లో లోకల్‌ రైళ్లను షార్ట్‌ టర్మానేట్‌ చేశారు. వచి్చన రైళ్లను అటునుంచి తిరిగి పంపించడంతో ప్లాట్‌ఫారాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఏ రైలు, ఎటు పోతుందో తెలియక ఉరుకులు పరుగులు తీశారు. రద్దీ ఉండే కీలకమైన స్టేషన్ల నుంచి బెస్ట్‌ బస్సులు నడిపినప్పటికీ అవి ఎటూ చాలకుండా పోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు డ్రైవర్లు, కండక్టర్లు విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించారు.

తగినంత సిబ్బంది లేకపోవడంతో బెస్ట్‌ సంస్ధ పూర్తి స్ధాయిలో బస్సులు నడపలేకపోయింది. అయినప్పటికీ 80 శాతం ప్రయాణికులను తమ గమ్యస్ధానాలకు చేరవేసింది. రైల్వే స్టేషన్ల బయట బెస్ట్‌ బస్సులతో పాటు రైళ్ల రాకపోకల తాజా వివరాలు వెల్లడించేందుకు అన్ని ప్రధాన స్టేషన్లలో అనౌన్స్‌మెంట్‌ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులకు, పర్యాటకులకు కొంత ఊరట లభించింది.  

అత్యంత పురాతనమైన వంతెన... 
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పశ్చిమ–తూర్పు ప్రాంతాలను కలిపేందుకు వందేళ్లకు ముందు బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన పురాతన వంతనలే ఉన్నాయి. ప్రస్తుతం అవి శిథిలావస్ధకు చేరుకోవడంతో దశలవారీగా వాటిని కూల్చివేయాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సెంట్రల్‌ రైల్వే మార్గంపై ఉన్న పురాతన వంతెనల్లో కర్నాక్‌ వంతెన ఆగ్రస్ధానంలో ఉంది.

కర్నాక్‌ వంతెన నిర్మాణ పనులు 1858లో ప్రారంభం కాగా 1868లో పూర్తయ్యాయి. ఈ వంతెన పూర్తి చేయడానికి మొత్తం పదేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో జెమ్స్‌ రివేట్‌ కర్నాక్‌ గవర్నర్‌గా పనిచేశారు. దీంతో ఈ వంతెనకు కర్నాక్‌గా నామకరణ జరిగింది. సెంట్రల్‌ రైల్వే మార్గంలో ఉన్న వివిధ పాత వంతెనల్లో ఇదే అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు పొందింది. అక్కడ ఈ వంతెన పేరు ఇంగ్లీష్‌, హిందీ, మరాఠీ భాషాల్లో రాసి ఉంది.  

కూల్చివేత పనులు ఇలా... 
50 మీటర్ల పొడవు, 18.8 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనను పూర్తిగా నేల మట్టం చేయడానికి 400 మందికిపైగా కార్మికులు, 100 మందికిపైగా సూపర్‌వైజర్లు, సాంకేతిక సిబ్బంది, 35 మంది రైల్వే అధికారులు, 42 మంది రైల్వే పోలీసులు, 350 టన్నుల సామర్థ్యం గల 3 భారీ క్రేన్లు, 500 టన్నుల సామర్థ్యం గల ఒక క్రేన్, 300 మందికిపైగా గ్యాస్‌ కట్టర్లు, ఆరు టవర్‌ వ్యాగన్లు వినియోగించాల్సి వచ్చింది. ఈ వంతెనపై ఉన్న ఇనుప రాడ్లు, ప్లేట్లు ఇలా మొత్తం 44 ముక్కలు చేశారు.

ఇందులో ఒక్కో ఇనుప ముక్క బరువు 10–12 టన్నులు ఉండగా మరికొన్ని 14–16 టన్నుల బరువున్నాయి. ఇందులో కొన్ని ముక్కలను ఒకేసారి పక్కకు నెట్టడానికి 350 టన్నుల సామర్థ్యంగల క్రేన్ల సాయం తీసుకున్నారు. కేవలం ఈ ముక్కలన్నీ పక్కకు నెట్టడానికి ఏకంగా ఎనిమిది గంటల సమయం పట్టింది. వంతెన శిథిలాలను తరలించేందుకు 50పైగా ట్రక్కులు, టిప్పర్లను వినియోగించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top