అది నేరంగా పరిగణించబడదు: బాంబే హైకోర్టు

Bombay HC Says Opening Pants Zip Not Sexual Assault Under POCSO Act - Sakshi

ముంబై: పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్న వేళ జస్టిస్‌ పుష్ప గనేడివాలా మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మైనర్‌ బాలిక చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్‌ తెరిచి ఉండటం వంటి చర్యలు పోక్సో చట్టం కింద నేరాలుగా పరిగణించబడవని పేర్కొన్నారు. అయితే భారత శిక్షాస్మృతి 354-ఏ(1)(i) సెక్షన్‌ కింద వీటిని లైంగిక వేధింపులుగా పరగణించవచ్చన్నారు. యాభై ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో జస్టిస్‌ పుష్ప ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

కేసు ఏమిటంటే..
తమ చిన్నారి పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి తన కూతురిని పక్కకు తీసుకువెళ్లి, తన చేతులు పట్టుకుని, ఆ తర్వాత అతడి ప్యాంటు విప్పేసి  వికృత చేష్టలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో సెషన్స్‌ కోర్టు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 10 కింద తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించింది. (చదవండిశరీరాన్ని శరీరం తాకలేదు గనుక..)

ఈ నేపథ్యంలో కేసు బాంబే హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ చేపట్టిన నాగపూర్‌ ధర్మాసనం.. నిందితుడి చర్యను లైంగిక దాడి అనలేమని, కాబట్టి  ఐపీసీ సెక్షన్‌ 354A (1)  (i) ప్రకారం మాత్రమే శిక్షకు అర్హుడని పేర్కొంది. కాగా ఈ సెక్షన్‌ ద్వారా నిందితుడికి మూడేళ్లపాటు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా జనవరి 19 నాటి తీర్పులో జస్టిస్‌ పుష్ప ‘‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో నేరం అవదు. చర్మాన్ని చర్మం తాకాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు’’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌) చట్టంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.(చదవండి: బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top