హుమాయూన్, మమత ఇద్దరూ ఒక్కటే
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్
రాణిగంజ్: టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చీఫ్ హుమాయూన్ కబీర్ ఇద్దరూ ఒక్కటేనని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే హుమాయూన్ ప్రకటించినట్లుగా బాబ్రీ మసీదును నిర్మించనివ్వబోమని స్పష్టం చేశారు. సోమవారం ఆయన బీర్భూమ్, పశ్చిమ్ బర్దమాన్ జిల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు.
అప్పట్లో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించగా.. ఆమె పార్టీ మాజీ నేత ఇప్పుడు అయోధ్యలో కూల్చిన బాబ్రీ మసీదును నిర్మించేందుకు చూస్తున్నారన్నారు. ‘550 ఏళ్లుగా టెంట్ కిందే ఉంటున్న రామ్ లల్లాను అలా ఉంచేందుకే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్‌పీ, బీఎస్‌పీలు మద్దతు తెలిపాయి. తిరుగులేని మెజారిటీతో గెలిచిన మోదీ ప్రభుత్వం మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది. మమతా బెనర్జీ మాదిరిగా ఆలోచించే హుమాయూన్ ఇప్పుడు బెంగాల్‌లో బాబ్రీ మసీదు కట్టాలనుకుంటున్నారు’అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాబ్రీ మసీదు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. బాంబులు, బుల్లెట్లకు బెంగాల్ ప్రజలు ఓట్లతోనే సమాధానం చెబుతారన్నారు. టీఎంసీ ప్రభుత్వాన్ని సాగనంపండి, ఆ వెంటనే సిండికేట్ కట్‌మనీ ముఠాదార్లను, వారి మద్దతుదార్లను తలకిందులుగా వేలాడదీసి, తాము దారికి తెస్తామని హెచ్చరికలు చేశారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి టాటాబైబై చెప్పి, బీజేపీకి అధికారమిచ్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు.
బీజేపీ కార్యకర్తలను చిత్రహింసలు పెట్టేందుకు టీఎంసీ నేరగాళ్లకు ఆశ్రయం కల్పిస్తోందంటూ మండిపడిన అమిత్ షా..మే 5న ఓట్ల లెక్కింపు తర్వాత కాషాయ పార్టీ కార్యకర్తలు ఈ నేరగాళ్లను బయటకు లాగి, చట్టం ముందు నిలబెడతారని స్పష్టం చేశారు. అందుకే టీఎంసీ గూండాలు మొదటి దశ పోలింగ్ జరిగే 23న ఇళ్లలోనే ఉండిపోవాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని మెజారిటీ మతస్తులను మమతా బెనర్జీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం చొరబాటుదార్లను వెళ్లగొట్టడమేనన్నారు.


