కాంగ్రెస్‌ కీలక సమావేశం.. క్యాండీ క్రష్‌ ఆడుతూ ఛత్తీస్‌గఢ్‌ సీఎం 

BJP Claims Chhattisgarh CM played Candy Crush During Congress Meeting:  - Sakshi

రాయపూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో తలమునకలైంది. దీనికి సంబంధించి రాయపూర్‌లో అతి ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ క్యాండీక్రష్‌ ఆడడం రాజకీయంగా మాటల యుద్ధానికి దారి తీసింది. రాయపూర్‌లో మంగళవారం రాత్రి అభ్యర్థుల ఎంపికపై  స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో సీఎం బఘేల్‌ తన ఫోన్‌లో క్యాండీక్రష్‌ ఆడుతూ కనిపించారు. ఈ ఫొటోను బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు.

‘‘అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతూ ఉంటే సీఎం హాయిగా క్యాండీక్రష్‌ ఆడుతూ రిలాక్సవుతున్నారు. బహుశా కాంగ్రెస్‌ ఎన్నికల్లో గెలవదని ఆయనకూ తెలిసి ఉంటుంది’’ అని మాలవీయ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. వీటిని బఘేల్‌ తిప్పికొడుతూ గతంలో తాను ఛత్తీస్‌గఢ్‌ సంప్రదాయ క్రీడలు గిల్లీ దందా, భవురా ఆడినప్పుడు కూడా బీజేపీ విమర్శలు చేసిందని గుర్తు చేశారు.

‘‘ఛత్తీస్‌గఢ్‌ సంప్రదాయ క్రీడలు ఎంత ఇష్టంగా ఆడతానో క్యాండీక్రష్‌ అంతే ఇష్టంగా ఆడతాను. క్యాండీక్రష్‌లో చాలా లెవల్స్‌ పూర్తయ్యాయి. ఇంకా ఆటని కొనసాగిస్తూ లెవల్స్‌ అన్నీ దాటతాను.  ఎవరు అధికారంలోకి వస్తారో రారో ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు’’ అని ఎదురుదాడి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో నవంబర్‌ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top