మనిషంటే ఒక నమ్మకం, అభిమానం.. వైరల్‌ అవుతున్న అంతిమయాత్ర వీడియో

Bihar: Muslim Family Performed Last Rites Of Their Hindu Employee - Sakshi

వైరల్‌: మత సామరస్యం.. మతోన్మాదులకు మింగుడు పడని విషయం. కష్టకాలంలో మనిషి.. మతానికి ఓటేస్తాడా? మానవత్వానికి ఓటేస్తాడా? మనిషంటే ఒక నమ్మకం.. ఆత్మీయత, అంతకు మించి అభిమానం. మానవత్వం ఎంతో గొప్పది. ఎందుకనో టీవీల్లో కూడా సరైన విషయాలను చూపించరు. ఒక పిల్లవాడు గాయపడితే.. ముందు అతన్ని పైకి లేపుతాం. గాయానికి మందు వేసి అతన్ని ఓదారుస్తాం. అంతేగానీ.. ఏ మతం బాబూ నీది అని అడగం. అసహ్యించుకోం. హిందువులు మా ఇంట కార్యక్రమాలకు హాజరవుతారు. అదే విధంగా మేం వాళ్ల కార్యక్రమాలకు హాజరవుతాం... 

దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై మొహమ్మద్‌ రిజ్వాన్‌ ఖాన్‌ చెప్తున్న మాటలివి. రిజ్వాన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అవుతున్నాడు. తన దుకాణంలో పని చేసే రామ్‌దేవ్‌ షా అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాడు రిజ్వాన్‌. బీహార్‌ రాజధాని పాట్నాలో రిజ్వాన్‌కు ఓ కుట్లు అల్లికల ఉత్పత్తుల షోరూం ఉంది. తన దగ్గర పాతికేళ్ల పాటు నమ్మకంగా పని చేసిన  రామ్‌ దేవ్‌ షా ఈ మధ్యే వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలిసిన రిజ్వాన్‌.. ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. 

ఆ పెద్దాయన పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. రిజ్వాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అంతిమ యాత్ర సమయంలో వెంటే ఉన్నారు. ‘‘పాతికేళ్ల కిందట ఓ పెద్దాయన రిజ్వాన్‌ దుకాణానికి వచ్చి పని ఏమైనా ఉందా? అని అడిగాడు. మోటు పని చేయలేవులే అన్నాను. లెక్కలు రాసే పని అయినా ఇమ్మని బతిమాలాడు. ఆయనెంతో సాదాసీదాగా కనిపించాడు. అందుకే పని ఇచ్చా.

ఇరవై ఏళ్లకు పైగా ఆయన నా దగ్గరే పని చేశారు. వయసు రిత్యా ఇబ్బందులతో బాధపడుతుంటే.. నెల నెల కొంత డబ్బు పంపించా. షా నాకు తండ్రి లాంటి వారు. నాకు ఒక పెద్ద దిక్కు. ఆయన కుటుంబం.. మా కుటుంబంతో సమానం. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నాకు చేతనైన రీతిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అంటూ గద్గద స్వరంతో మాట్లాడాడు రిజ్వాన్‌.

ఎన్డీటీవీ సౌజన్యంతో..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top