బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై ఉంది. ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ కూటముల్లో అధికారం ఏ పక్షానికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో (Exit Polls Predict) కొంత స్పష్టత వచ్చింది. ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిల్ పోల్స్ అంచనా కట్టాయి. అయితే ఊహించినట్టుగానే ఫలితాలు వస్తాయా, మరేదైనా అద్భుతం జరుగుతుందా అనేది శుక్రవారం (నవంబర్ 14) తెలుస్తుంది.
ఇదిలావుంటే ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి ఎన్ని సీట్లు దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. యువనేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నాయకత్వ పటిమకు ఈ ఎన్నికల ఫలితాలు గీటురాయి కానున్నాయి. సొంత రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలని భావించిన చిరాగ్.. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమకు బిహార్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పదేపదే చెబుతూ ఎన్నికల ప్రచారం సాగించారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పటికీ బిహార్ ఎన్నికలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరాగ్ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఎన్డీఏ (NDA) కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీకి సీట్ల పంపిణీలో 29 స్థానాలు దక్కాయి. అయితే ఆ పార్టీ 28 స్థానాల్లో మాత్రమే పోటీకి దిగింది. ఎల్‌జేపీ అభ్యర్థులు 29 స్థానాల్లో నామినేషన్లు వేసినప్పటికీ ఒక నియోజకవర్గంలో నామినేషన్ తిరస్కణకు గురైంది. దీంతో 28 స్థానాల్లో పోటీకి పరిమితమైంది. ఈసారి ఎల్‌జేపీకి ఫలితాలు ఆశాజనకంగానే ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గరిష్టంగా 19 స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థలు ప్రకటించాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనా
చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 14 నుంచి 19 సీట్లు దక్కే అవకాశముందని చాణక్య సంస్థ వెల్లడించింది. 12 నుంచి 16 స్థానాల్లో ఎల్‌జేపీ గెలుస్తుందని పోల్ డైరీ అనే సంస్థ అంచనా వేసింది. టీఐఎఫ్ రీసెర్చ్ సర్వేలో 12 నుంచి 14 సీట్లు వస్తాయని తేలింది. పోల్‌స్ట్రాట్ ప్రకారం.. 9 నుంచి 12 స్థానాల్లో ఎల్‌జేపీ విజయం సాధిస్తుంది. మ్యాట్రిజ్-ఐఎఎన్ఎస్ సర్వే మాత్రం 7 నుంచి 9 స్థానాలకే పరిమితం చేసింది.
డిప్యూటీ సీఎం అవుతారా?
దివంగత రాజకీయ నేత రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడైన చిరాగ్.. బిహార్ రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఐదేళ్లలో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌జేపీ ఒంటరిగా 137 స్థానాల్లో పోటీ చేసి చేదు అనుభవాన్ని చవిచూసింది. తన తండ్రి స్థాపించిన పార్టీ నుంచి తనను దూరం చేసే పరిస్థితి రావడంతో 2021లో ఎల్‌జేపీ (ఆర్వీ) పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాలు సాధించడంతో.. మూడోసారి ఎంపీగా గెలిచిన చిరాగ్‌కు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. ఎక్కువ స్థానాలు గెలిస్తే.. ఎన్డీఏలో చిరాగ్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. డిప్యూటీ సీఎం అయ్యే చాన్స్ కూడా రావొచ్చు!
చదవండి: బిహార్‌లో పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభం?
తనను తాను యువ బిహారీగా (Yuva Bihari) చెప్పుకునే 43 ఏళ్ల చిరాగ్.. ముఖ్యమంత్రి పదవికి మూడవ ఎంపిక అని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వెల్లడించాయి. తేజస్వీ యాదవ్ సీఎం కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. సీఎం నితీశ్ కుమార్ రెండో స్థానంలో నిలిచినట్టు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కాగా, డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చేయడానికి అవసరమైన సీట్లు సాధించాలని చిరాగ్ కోరుకుంటున్నారు. ఎన్డీఏ సర్కారు మళ్లీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి తర్వాత అతిపెద్ద పదవిని తమ పార్టీ అధిష్టించనుందని గతంలో చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తాను ఎన్డీఏతోనే ఉంటానని కూడా స్పష్టం చేశారు. చిరాగ్ పాశ్వాన్ రాజకీయ ప్రస్థానం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలియాలంటే.. ఎన్నికల ఫలితాలు విడులయ్యే వరకు వేచి చూడాల్సిందే.


