యశవంతపుర(కర్ణాటక): మహిళలను వేధించిన వ్యవహారంలో దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె సీఐ పీజీ సందేశ్ వివాదం కొనసాగుతూనే ఉంది. వేధింపుల కేసులో ఆయనను సస్పెండ్ చేస్తే సరిపోదు, కేసు కూడా పెట్టాలి అని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా వేణూరు పోలీసులు సందేశ్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 2020 నుంచి 2023 మధ్య మూడేళ్లపాటు తన ఇంటికి సందేశ్ తరచూ వస్తూ లైంగిక దాడి చేసేవాడని మహిళ ఫిర్యాదులో ఆరోపించడం సంచలనం కలిగిస్తోంది. ఇది జిల్లా పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది.
2020లో సందేశ్ బెళ్తంగడి సర్కిల్‌లోని వేణూరు పోలీసుస్టేషన్ సీఐగా పని చేసేవారు. ఘటన అక్కడే జరగడంతో కేసును అక్కడే నమోదు చేసుకున్నారు. సందేశ్‌పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక వేధింపుల అరోపణలు అవాస్తవమని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ అంతలోనే రేప్ కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రానురాను ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న కుతూహలం వ్యక్తమవుతోంది. అలాగే సీఐని అరెస్టు చేస్తారా అనేది మిస్టరీగా మారింది.


