Oruganti Mahalakshmamma Life Story: మహోద్యమ మహాలక్ష్మి 

Azadi Ka Amrit Mahotsav:The Story Of Oruganti Mahalakshmamma - Sakshi

‘‘నాయకుడికుండాల్సింది నిరాడంబరత’’ అని గాంధీజీ ఆచరణలో చూపారు. ఆ కోవలోనే నెల్లూరు జిల్లాలోని సంపన్న కుటుంబానికి చెందిన ఒక గృహిణి చేతితో వడికిన నూలును భుజాన వేసుకొని కాలినడకన తిరుగుతూ దేశభక్తి గీతాలు పాడుతూ ప్రజలను చైతన్యపరిచారు. నిరాడంబరత, నమ్మిన సిద్ధాంతాలను కడదాకా ఆచరించి, మహిళాశక్తికి ఉదాహరణగా నిలిచిన ఆ ధీశాలి ఓరుగంటి మహలక్ష్మమ్మ. 

స్ఫూర్తినిచ్చే ఓరుగంటి మహాలక్ష్మమ్మ  ప్రసంగాలు పినాకినీ నదీ తీర ప్రాంతాల్లో ఎంతో ఉత్తేజం రగిల్చేవి. ఆమె చేపట్టిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజల్లో ఆమెకు ఎంతో గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టాయి. ఎంత ఎదిగినా, ఎంత పేరుగాంచినా ఒదిగి ఉండడం ఓరుగంటి మహలక్ష్మమ్మ ప్రత్యేకత. సహాయ నిరాకరణ ఉద్యమం, హోమ్‌రూల్‌ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం... ఇలా ప్రతి స్వాతంత్య్రోద్యమ కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. చివరకు ఆమె ప్రసంగాల జ్వాలకు భీతిల్లిన బ్రిటిష్‌ ప్రభుత్వం మహలక్ష్మమ్మకు పలుమార్లు జైలు శిక్ష విధించింది. జైలు జీవితం ఆ మహనీయురాలి ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంతో స్వాతంత్య్రం రావడానికి రెండేళ్ల ముందే ఆమె కన్నుమూశారు. 

స్వయంకృషితో విద్యాభ్యాసం
1884లో సంపన్న కుటుంబీకులైన శ్రీ తూములూరి శివకామయ్య, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించిన చిన్న కుమార్తె మహాలక్ష్మమ్మ పెద్దగా బడికెళ్లి చదువుకోలేదు, ఇంటి నుంచే చదువుకుని, ఉన్నత విద్యావంతురాలిగా స్వయంకృషితో ఎదిగారు. మహాలక్ష్మమ్మకు శ్రీ ఓరుగంటి వెంకట సుబ్బయ్యతో  వివాహం జరిగింది. ఆయన కుటుంబం దేశభక్తి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. భర్త అడుగు జాడల్లో ఆయన చేసే సామాజిక కార్యకలాపాల్లో మహాలక్ష్మమ్మ కూడా పాలుపంచుకునే వారు.

పేదవారి కోసం అన్నదాన సత్రాలను కూడా నడిపేవారు. అనంతరం ఆమె విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖాదీ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చారు. ఖాదీ వాడకాన్ని కేవలం తమ కుటుంబానికి మాత్రమే పరిమితం చేయకుండా,  కావలిలో ఖాదీ మార్కెట్‌ ను నెలకొల్పి, ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఆర్థికంగా ఉన్నత శ్రేణికి చెందిన వారు అయినప్పటికీ, వడికిన ఖాదీని తన భుజాల మీద వేసుకుని, నగరమంతా తిరిగి అమ్ముతూ దేశభక్తి గీతాలు పాడుతూ, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేవారు. 1905లో బెంగాల్‌ విభజన తర్వాత, బ్రిటిష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా స్వరాజ్య పోరాటాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లవలసిన అవసరాన్ని మహాలక్ష్మమ్మ, ఆమె భర్త గ్రహించారు. సంగీత సమాజం, భజన మండలిని ఏర్పాటు చేసి, స్వదేశీ వస్తువులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, స్వరాజ్య సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి అనేక చోట్ల ఉత్తేజకరమైన బహిరంగ ప్రసంగాలు, ప్రదర్శనలు ఇచ్చేవారు. దీంతో వీరి కుటుంబంపై బ్రిటిషర్ల దృష్టి పడింది.

బ్రిటిష్‌ రెవెన్యూకు గొడ్డలిపెట్టు
1920లో మహాత్మ గాంధీ సహాయనిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో ఈ ఉద్యమానికి ఓరుగంటి మహాలక్ష్మమ్మ నాయకత్వం వహించారు. స్ఫూర్తిని రగిలించే ఆమె ప్రసంగాలు పినాకిని ప్రాంతంలోని మహిళా శక్తిని, సహాయనిరాకరణ ప్రచారంలో పాల్గొనే దిశగా ప్రోత్సహించాయి. ఫలితంగా ఆ రోజుల్లోనే 2 లక్షల రూపాయలు దాటే నెల్లూరు ఎక్సైజ్‌ ఆదాయం రెండు వందల రూపాయలకు పడిపోయింది.  అప్పటికే ఆమెపై నిఘా ఉంచిన ప్రభుత్వం ఇక ఉపేక్షించకూడదని భావించింది. 

అనంతరం ఉప్పు సత్యాగ్రహ సమయంలో చురుగ్గా పాల్గొంటున్న మహలక్ష్మమ్మను ప్రభుత్వం అరెస్టు చేసింది. జైలు నుంచి తిరిగి విడుదలైన తర్వాత ఆమె మరింత ఉత్సాహంతో స్వరాజ్య ఉద్యమంలో పాల్గొనడం కొనసాగించారు. హరిజనుల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలనలో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నారు.

శాసనోల్లంఘన ఉద్యమం 1932లో రెండవ సారి విస్తృతమైనప్పుడు మహాలక్ష్మమ్మ ఉత్తేజిత ప్రసంగాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ, స్వాతంత్య్రేచ్ఛను రగిలించాయి. ఆమె నెల్లూరులో ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో, భయాందోళనలకు గురైన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమెను మరోసారి అరెస్టు చేసి, ఒక ఏడాది పాటు రాయవేలూరు జైలుకు పంపింది. ఈసారి జైలుశిక్ష ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఆమె ఇద్దరు కుమారులు  కూడా  జైలు పాలయ్యారు. ఒకపక్క ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో 1942లో ఆమె భర్తకు మూడవసారి జైలు శిక్షపడింది. ఈ బాధతో ఆమె 1945లో దివంగతులయ్యారు.

స్త్రీవిద్య– వితంతు వివాహం
తాను చెప్పే ఆదర్శాలు కేవలం మాటలకే పరిమితం కాదని మహాలక్ష్మమ్మ నిరూపించారు. 1914–15లో కర్నూలుకు చెందిన ముతరాజు వెంకట కృష్ణయ్య తన వితంతు కుమార్తెకు తిరిగి వివాహం చేశారు. ఈ వార్తను విన్న మహాలక్ష్మమ్మ ఎంతో ఆనందపడ్డారు. ఈ ప్రగతిశీల చర్యను ప్రచారం చేయాలనే ఉద్దేశంతో, వారిని కావలికి ఆహ్వానించి సత్కరించారు. ఈ సంఘటన సమాజంలో సంప్రదాయ కట్టుబాట్లను పాటించే ఎంతో మందికి నచ్చలేదు. ఫలితంగా మహాలక్ష్మమ్మ కుటుంబాన్ని వారు బహిష్కరించారు. కానీ ఇందుకు చలించని ఆమె తన కుమారుల్లో ఒకరికి వితంతువును ఇచ్చి వివాహం చేసి ఆదర్శాచరణ చేశారు. 

అనిబిసెంట్‌ హోమ్‌ రూల్‌ లీగ్‌ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మహాలక్ష్మమ్మ దంపతులు నెల్లూరులో హోమ్‌ రూల్‌ లీగ్‌ ప్రాంతీయ విభాగాన్ని ప్రారంభించారు. హోమ్‌ రూల్‌ లీగ్‌ బ్యాడ్జి ధరించి, ఆ బృహత్కార్య ఉద్దేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. జాతీయ ఉద్యమంలో చేరడానికి మహిళలను ప్రోత్సహించేందుకు 1921లో నెల్లూరులో కాంగ్రెస్‌ మహిళా విభాగాన్ని స్థాపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమెతో పాటు శ్రీమతి పొణకా కనకమ్మ అనే మరో స్వాతంత్రయోధురాలు ఈ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామ్యం వహించారు. వీరిద్దరూ కలసి కస్తూరి దేవి విద్యాలయాన్ని స్థాపించారు. ఈ సంస్థ మహాత్మా గాంధీ నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఆ విధంగా అటు వితంతు వివాహం, స్త్రీవిద్య విషయంలోనూ మహాలక్ష్మమ్మ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. స్వాతంత్య్రోద్యమ అమృతోత్సవ వేళ ఇటువంటి బహుముఖ ఉద్యమశీలిని స్మరించుకోవడం సముచితం!
– దగ్గరాజు శాయి ప్రమోద్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top