దిస్పూర్: అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసలను అరికట్టడానికి ఇక నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఆధార్ కార్డుల జారీ నిలిపివేసినట్లు పేర్కొంది. అయితే ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం 2027 వరకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది
అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు ఎంత అరికట్టినా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ 100% మించిపోయింది. కొన్ని చోట్ల ఆ పర్సంటైజ్ 115% వరకు ఉంది. అంటే అక్రమంగా వలస వచ్చిన వారికి సైతం ఆధార్ కార్డు లభించింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి ఇకపై సాధారణ పద్ధతిలో ఆధార్ కార్డుల జారీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా ఆధార్ కార్డు పొందాలంటే కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఈ నిబంధనల నుండి దివ్యాంగులు ఎస్సీ, ఎస్టీ, కాఫీ తోటల కార్మికులకు మార్చి31, 2027 వరకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో 18 ఏళ్లలోపు పిల్లలు, యువతకు సాధారణ పద్ధతిలో ఆధార్ కార్డు జారీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది.
కాగా అస్సాంలో ఎన్నో ఏళ్లు తరబడిగా అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. అస్సాం రాష్ట్రం బంగ్లాదేశ్‌తో దాదాపు 267.5 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. దానిలో చాలా వరకూ చాలా వరకు కంచె వేసినప్పటికీ, నదులు, అడవులు మరియు కొండ ప్రాంతాల కారణంగా కొన్ని చోట్ల సరిహద్దులు ఇప్పటికీ పూర్తిగా మూసివేయబడలేదు.
ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని అక్రమ వలసదారులు భారతదేశంలోకి చొరబడుతున్నారు. అక్రమ వలసల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గడంతో పాటు అస్సాం యొక్క ప్రత్యేకమైన భాష, సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతాయనే భయం స్థానికులలో ఉంది. దీంతో వలసలను నిరోధించేలా అస్సాం ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.


