
గువాహటి: అస్సాంలో వరద బీభత్సం వల్ల జనం చెల్లాచెదురైపోతున్నారు. సొంత గ్రామాలు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. జమునాముఖ్ జిల్లాలో చాంగ్‌జురాయ్, పాటియా పత్తర్ గ్రామాలకు చెందిన 500కుపైగా కుటుంబాలు ఇప్పుడు రైలు పట్టాలపై తలదాచుకుంటున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వారి ఇళ్లు నీట మునిగిపోయాయి. గత్యంతరం లేక రైలు పట్టాలపై ఉంటున్నామని జనం చెప్పారు.
వరదలతో కట్టు బట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదని, ఆకలితో అల్లాడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. కొన్నిచోట్ల తాత్కాలిక గుడారాల్లో జనం సర్దుకుంటున్నారు. ఐదు రోజులుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు. అస్సాంలోని 29 జిల్లాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదలతోపాటు కొండ చరియలు విరిగి పడడంతో 14 మంది మరణించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 343 సహాయక శిబిరాల్లో 86,772 మంది ఆశ్రయం పొందుతున్నారు.