
జాబిల్లి చుట్టిరానున్న ఎస్‌డీ కార్డ్
ఈ కార్డులో సామాన్యుల పేర్లు
ఆర్టెమిస్–2 మిషన్ లో నాసా అవకాశం
చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుతుంటాం. జాబిల్లి ఎలాగూ మన దగ్గరకు రాదు. పోనీ చంద్రమండలం మీద అడుగుపెడదామన్నా అందరికీ సాధ్యం కాదు. భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా? అంతరిక్ష పరిశోధనలో తదుపరి పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా.. సామాన్యులనూ భాగస్వాములను చేసేందుకు మరోసారి ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
2026 ఏప్రిల్‌లోగా ప్రారంభం కానున్న ఆర్టెమిస్–2 మిషన్ లో భాగంగా ఓరియన్ అంతరిక్ష పరిశోధన నౌకలో వ్యోమగాములు రీడ్ వైజ్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేయనున్నారు. వారితోపాటు ఓ మెమరీ కార్డు సైతం జాబిల్లిని చుట్టి రానుంది. ఈ మెమరీ కార్డ్‌లో చేర్చడానికి తమ పేర్లను సమర్పించాల్సిందిగా ప్రజలను నాసా ఆహ్వానిస్తోంది. చంద్రుడికో నూలుపోగు మాదిరిగా చంద్రుడి మీదకో ‘పేరు’ అన్నమాట. చరిత్రలో భాగం కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. – సాక్షి, స్పెషల్ డెస్క్
డిజిటల్ బోర్డింగ్ పాస్
ఆసక్తిగలవారు ఉచితంగా తమ పేరును జోడించి తక్షణమే డిజిటల్ ‘బోర్డింగ్ పాస్’ పొందగలిగేలా నాసా ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసింది. సేకరించిన పేర్లన్నీ ఓరియన్ లోపల ఇన్ స్టాల్ చేసే ఎస్‌డీ కార్డ్‌లో నిక్షిప్తం చేస్తారు. మొదటిసారిగా సిబ్బందితో కూడిన ఆర్టెమిస్ మిషన్ లో వ్యోమగాములతోపాటు మీ పేరూ జాబిల్లిని చుట్టి వస్తుందన్నమాట.
సో, సరదాగా గుర్తిండిపోయేలా మీ పేరుతో డిజిటల్ బోర్డింగ్ పాస్ చేజిక్కించుకునేందుకు మీరూ దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ 2026 జనవరి 21. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినప్పుడు సామాన్యులనూ భాగస్వాములను చేయడం నాసా ప్రత్యేకత.
కీలకమైన అడుగు
10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో నాసా కొత్త స్పేస్ లాంచ్ సిస్టమ్, ఓరియన్ అంతరిక్ష నౌక పనితీరును అధ్యయనం చేస్తారు. వ్యోమగాములు భూమి నుండి 2,30,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి.. తిరుగు ప్రయాణంలో చంద్రుని అవతలి వైపు చుట్టూ తిరుగుతారు. ఈ దశాబ్దం చివర్లో చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను దింపడం, అలాగే మానవులను అంగారక గ్రహానికి పంపాలన్న నాసా ప్రయత్నంలో ఇది ఒక కీలకమైన అడుగు.