త‌న దిష్టిబొమ్మ‌కు నిప్పు పెడుతూ గాయ‌ప‌డిన బీజేపీ ఎమ్మెల్యేకు ప‌రామ‌ర్శ‌ | Akhilesh Yadav visits BJP MLA Anupama Jaiswal at hospital | Sakshi
Sakshi News home page

Akhilesh Yadav: బీజేపీ మ‌హిళా ఎమ్మెల్యేకు ప‌రామ‌ర్శ‌

Apr 29 2026 2:04 PM | Updated on Apr 29 2026 2:26 PM

Akhilesh Yadav visits BJP MLA Anupama Jaiswal at hospital

ల‌క్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్త‌ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాదవ్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎమ్మెల్యేను స్వ‌యంగా ప‌రామ‌ర్శించి మంచి సంప్ర‌దాయానికి తెర‌తీశారు. నిరసన కార్య‌క్ర‌మంలో తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ అగ్నిప్ర‌మాదానికి గురైన బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌ను (MLA Anupama Jaiswal) మంగళవారం లక్నోలోని మెదాంత ఆసుపత్రిలో అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. సానుకూల రాజకీయాల‌తో పాటు మానవ సంబంధాల విలువ‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించారు.

రాజ‌కీయాల క‌న్నా మానవ సంబంధాలు ముఖ్య‌మ‌ని, మ‌నుషుల మ‌ధ్య సామ‌ర‌స్యం వెల్లివిరియాల‌ని ఆయ‌న 'ఎక్స్‌'లో పేర్కొన్నారు. ''ప్రజల మధ్య వైష‌మ్యాలు రేగ‌డం మాకు ఇష్టం లేదు. సమాజంలో శాంతి, సామ‌ర‌స్యం ఉండాల‌నిమ బ‌లంగా కోరుకుంటున్నాం. సానుకూల రాజకీయాల్లోని ఆరోగ్యకరమైన సంప్రదాయం మనకు ఇదే నేర్పింది. అందుకే బీజేపీ ఎమ్మెల్యే శ్రీమతి అనుపమ జైస్వాల్ గారిని కలవడానికి వెళ్లి, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాం. రాజ‌కీయాలు, మానవ సంబంధాలు.. దేని స్థానం దానిదే. సద్భావన, సామరస్యం వ‌ర్ధిల్లాలి!'' అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

పార్ల‌మెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న విప‌క్ష‌ ఇండియా బ్లాక్‌కు వ్యతిరేకంగా శ‌నివారం ల‌క్నోలో బీజేపీ నిర్వహించిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ గాయ‌ప‌డ్డారు. అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో ఆమె ముఖానికి, నుదురుకు కాలిన గాయాల‌య్యాయి. దిష్టిబొమ్మకు నిప్పు పెట్టడానికి అగ్గిపెట్టెను వెలిగించగానే ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో ఆమె జుట్టుకు కూడా నిప్పంటుకుంది. బీజేపీ కార్య‌క‌ర్త‌లు వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

చ‌ద‌వండి: 'నేను చ‌ద్దాను కాదు.. బీజేపీలోకి వెళ్ల‌ను'

ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే అఖిలేష్ యాద‌వ్ 'ఎక్స్‌'లో స్పందించారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని శ‌నివారం 'ఎక్స్‌'లో పోస్ట్ పెట్టారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌, జైస్వాల్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్న వీడియోను షేర్ చేశారు. కాగా, ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌.. బహ్రాయిచ్ నియోజ‌క వ‌ర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement