అంతటా పొల్యూషన్‌.. ఏదీ సొల్యూషన్‌! | Air Pollution: WHO Warns That 99 Percent Of Earth Is Polluted | Sakshi
Sakshi News home page

అంతటా పొల్యూషన్‌.. ఏదీ సొల్యూషన్‌!

May 9 2022 2:05 AM | Updated on May 9 2022 2:05 AM

Air Pollution: WHO Warns That 99 Percent Of Earth Is Polluted - Sakshi

పొద్దున, సాయంత్రం చల్లగాలి.. వారానికోసారి పార్కులోని చెట్ల గాలి.. ఆఫీసులు, ఇళ్లలో ఏసీ గాలి.. ఇలా ఏ గాలి అయినా ఒకటేనట. ఊరుదాటి వెళితే స్వచ్ఛమైన గాలి దొరుకుతుందన్నదీ ఉత్త మాటేనట. ఇక్కడా, అక్కడా అని కాదు.. భూమ్మీద ఉన్న 700 కోట్ల మంది జనాభాలో 99 శాతం కలుషిత గాలే పీల్చుకుంటున్నారట.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. కరోనా మహమ్మారిని చూసి భయపడుతున్నాంగానీ.. అంతకంటే వేగంగా కాలుష్యం లక్షల మంది ప్రాణాలు తీస్తోందని పేర్కొంది. మరి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు, సూచనలేమిటో చూద్దామా..     
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

నాలుగేళ్లలో మరింత పెరిగి.. 
గాలిలో ఏయే కలుషితాలు గరిష్టంగా ఎంతవరకు ఉండవచ్చనే దానిపై డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించింది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో గాలి ఈ ప్రమాణాల మేరకు లేదని డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదికలో హెచ్చరించింది. అధిక ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఐదో వంతు మాత్రమే కాలుష్య పరిమితుల్లో ఉంటే.. పేద దేశాల్లో ఒక శాతం మాత్రమే తక్కువ కాలుష్యంతో ఉన్నాయని తెలిపింది.

ఈ కలుషిత గాలి పీల్చడం వల్ల కోట్ల మందికి గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. భూమ్మీద నాలుగేళ్ల కింద 90శాతంగా ఉన్న ఉన్న కాలుష్య ప్రభావ ప్రాంతం.. ఇప్పుడు 99 శాతానికి చేరిందని తెలిపింది. తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత తక్కువగా ఉందని స్పష్టం చేసింది.

ఈ కాలుష్యం వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారని, మరెంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో పర్యావరణ డైరెక్టర్‌ డాక్టర్‌ మరియా నీరా వెల్లడించారు. పెట్టుబడులు వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతున్నాయే తప్ప.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలిని అందించడం లేదని పేర్కొన్నారు. 

వేగంగా పెరుగుతున్న కలుషితాలు 
మనుషులు ఏడాదిపాటు పీల్చేగాలిలో 2.5 పీఎం రేణువులు 5 గ్రాములకంటే ఎక్కువ ఉండొద్దు, 10 పీఎం రేణువులు 15 గ్రాములు దాటకూడదు. నైట్రోజన్‌ ఆక్సైడ్‌ సాంద్రత ఏడాదికి పదిగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ చాలా వరకు అధికాదాయ దేశాల్లోని నగరాలు ఈ స్థాయిలను ఎప్పుడో దాటి ప్రమాదకర స్థితికి వెళ్లిపోయాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

తక్కువ ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఈ పరిస్థితి కొంత తక్కువగా ఉందని వెల్లడించింది. నైట్రోజన్‌ ఆక్సైడ్‌ స్థాయి విషయంలో పేద, ధనిక తేడా లేదని.. అన్ని దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపింది. మొత్తంగా 4 వేల నగరాల్లోని 77 శాతం ప్రజలు నైట్రోజన్‌ ఆక్సైడ్‌ స్థాయి ఎక్కువున్న గాలినే పీలుస్తున్నారని వెల్లడించింది.

తక్కువ స్థాయి వాయు కాలుష్య కారకాలు కూడా గణనీయమైన హానిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కర్బన ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే తప్ప గాలి కాలుష్య స్థాయిని తగ్గించలేమని స్పష్టం చేసింది. 

►పీఎం అంటే పర్టిక్యులేట్‌ మేటర్‌ (అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళి కణాలు). 2.5 మైక్రోమీటర్లకన్నా చిన్నవాటిని పీఎం 2.5, 10 మైక్రోమీటర్ల పరిమాణం ఉన్నవి పీఎం 10గా పేర్కొంటారు. నిర్మాణాలు జరుగుతున్న చోట, కచ్చారోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు, మంటలు, వివిధ రకాల పొగల నుంచి ఇవి ఏర్పడుతాయి. సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజైన్‌ ఆక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులు పవర్‌ ప్లాంట్లు, పరిశ్రమలు, వాహనాల నుంచి ఎక్కువగా వెలువడతాయి. 

శిలాజ ఇంధనాలపై ఆధారపడొద్దు
‘ఒక మహమ్మారి నుండి బయటపడ్డామనుకుంటే... కాలుష్యాన్ని పెంచుకుంటూ, మనం నివారించగల మరణాలను కూడా కొని తచ్చుకుంటున్నాం. వాయు కాలుష్యం కారణంగా మంచి ఆరోగ్యాన్ని కోల్పోవడం ఆమోదయోగ్యం కాదు. వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించాల్సిన అవశ్యకత ఇప్పుడు మన ముందుంది. శిలాజ ఇంధనాలపై తక్కువ ఆధారపడే ప్రపంచం అవసరం’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ వ్యాఖ్యానించారు.

117 దేశాల్లో పరిశీలన చేసి.. 
డబ్ల్యూహెచ్‌వో 117 దేశాల్లోని 6 వేల నగరాల్లో కాలుష్య డేటాను పరిశీలించింది. వాహనాలు, రోడ్‌ ట్రాఫిక్‌ వల్ల ప్రమాదకరమైన నైట్రోజన్‌ ఆక్సైడ్‌ పెరిగిపోతోందంది. ప్రమాదకర దుమ్ము, ధూళి రేణువుల శాతం పెరిగిందని తెలిపింది. ఇవి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరుతున్నాయని.. రక్తపోటు, శ్వాస సంబంధిత సమస్యలు, కేన్సర్లకు కారణమవుతున్నాయని తేల్చి చెప్పింది.

దుమ్ము, ధూళికి తోడు నైట్రోజన్‌ ఆక్సైడ్‌ పెరగడంతో.. ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నట్లు హెచ్చరించింది. రవాణా, విద్యుత్, సాగు కోసం అధికంగా ఇంధనాన్ని కాల్చడమే కాలుష్యానికి ప్రధాన కారణమని తెలిపింది. 

ఇబ్బంది పడేవాళ్లెవరు..? కాలుష్యం వల్ల ఎక్కువగా 
ఊపిరితిత్తులు, గుండె సంబంధిత, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఇబ్బంది పడతారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అధికంగా ప్రభావితమవుతారు. 

►కాలుష్యంతో తాత్కాలికంగా.. తలనొప్పి, ముక్కు, గొంతు, కళ్లు మంటలు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా, బ్రాంకైటిస్‌ వంటి సమస్యలు వస్తాయి. 

►దీర్ఘకాలికంగా.. కేంద్రనాడీ వ్యవస్థపై ప్రభావంతో తలనొప్పి, యాంగ్జైటీ , గుండె సంబంధిత జబ్బుల పెరుగుదల, ఆస్తమా, కేన్సర్, శ్వాసకోశ ఇబ్బందులు, కాలేయం, ప్లీహం, రక్త ప్రసరణపై ప్రభావం వంటివి తలెత్తుతాయి. 

మనమేం చేయొచ్చు
►వాహనాల వాడకాన్ని వీలైనంతగా తగ్గించడం. 
►కరోనాతో సంబంధం లేకుండా మాస్క్‌ ధరించే అలవాటు కొనసాగించడం. 
►దుమ్ము, ధూళి ఇంట్లోకి రాకుండా చూసుకోవడం. 
►రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు కలుషి తాల నుంచి రక్షణ పొందేలా ఏర్పాట్లు చేసుకోవడం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement