
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం. ఎయిరిండియా విమానంలో మంటలు వ్యాపించాయి. మంగళవారం (జూలై 22) హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315 ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ జరిగిన కొద్ది సేపటికే విమానం ఏపీయూలో (Auxiliary Power Unit)లో మంటలు చెలరేగాయి.
ప్రమాదంతో అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
ఏపీయూ అనేది విమానాల్లో తోక భాగంలో గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌లా పనిచేస్తుంది. విమానంలో లైట్లు, కంప్యూటర్లు, నావిగేషన్ వ్యవస్థలు మొదలైనవి ఈ ఏపీయూ వ్యవస్థ ద్వారా పని చేస్తాయి. విమానం ఇంజిన్ ప్రారంభం కావాలంటే తగినంత గాలి కావాలి. ఆ గాలిని ఈ ఏపీయూ అందిస్తోంది. అంతేకాదు కేబిన్‌లో ప్రయాణికులకు చల్లటి గాలిని అందించడంలో సహాయపడుతుంది. విమానానికి ఉన్న మెయిన్ ఇంజిన్ విఫలమైతే ఏపీయూ ద్వారా గాలి,కరెంట్ ఉత్పత్తి అవుతుంది.