అన్నాడీఎంకేలో చీలిక! | AIADMK Split: Velumani Supporters against Palaniswami | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేలో చీలిక!

May 12 2026 5:33 AM | Updated on May 12 2026 5:33 AM

AIADMK Split: Velumani Supporters against Palaniswami

తమిళనాడు అసెంబ్లీ వేదికగా పార్టీలో విభేదాలు బహిర్గతం

పళనిస్వామిపై వేలుమణి వర్గం తిరుగుబాటు 

తమ వర్గం నుంచే పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాలని డిమాండ్‌

సాక్షి, చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు వెలుగుచూశాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం చెందడంతో పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ముందుకు సాగేది లేదని మెజార్టీ ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమని స్పష్టమవుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్‌ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం సారథ్యం వహిస్తున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వీళ్లిద్దరికే మద్దతు తెలపడంతో తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. పార్టీ ఘోర పరాభవానికి పళనిస్వామే కారణమని, అలాంటి వ్యక్తి అసెంబ్లీలో పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా కొనసాగే అర్హత కోల్పోయారని వేలుమణి, షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. షణ్ముగంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని తిరుగుబాటు వర్గం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రొటెం స్పీకర్‌ కరుప్పయ్యను కలిసి వినతి పత్రం అందజేసింది. అయితే పళనిస్వామినే పార్టీ తరఫున శాసనసభాపక్ష నేతగా అనుమతించాలంటూ థలవై సుందరం సారథ్యంలోని ఎమ్మెల్యేల బృందం మరో వినతి పత్రాన్ని ప్రొటెం స్పీకర్‌కు అందజేసింది. 

శాసన సభాపక్ష నేత పదవి కోసం..  
17వ శాసనసభ తొలి సమావేశానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు బృందాలుగా రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పళనిస్వామితోపాటు కొద్ది మంది ఎమ్మెల్యేలే సభకు వచ్చారు. షణ్ముగం, వేలుమణి వెంట మిగతా ఎమ్మెల్యేంతా నడిచారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలంటూ షణ్ముగం పేరును తాత్కాలిక స్పీకర్‌ పిలిచినప్పటికీ ఆయన ముందుకురాలేదు. వేలుమణి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అన్నాడీఎంకేలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బల్లలు చరిచి మద్దతు తెలిపి తాము తిరుగుబాటు జెండా ఎగరేశామని అసెంబ్లీ సాక్షిగా పరోక్షంగా ప్రకటించారు. ఎమ్మెల్యేగా పళనిస్వామి ప్రమాణం చేస్తున్నప్పుడు కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా బల్లలు చరిచారు. దీంతో పార్టీలో విబేధాలు పొడచూపాయని అసెంబ్లీలో అందరికీ అర్థమైపోయింది. మరోవైపు మాజీ మంత్రి, ప్రస్తుతం డీఎంకేలో ఉన్న సెంథిల్‌ బాలాజీతో వేలుమణి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

ఎవరికెంత బలం? 
ప్రస్తుత పార్టీ చీఫ్‌ పళనిస్వామి వెంట కేవలం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. షణ్ముగం, వేలుమణి వర్గంలో ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభాపక్ష నేత ఎన్నిక వ్యవహారం చినికిచినికి గాలివానగా చివరకు పార్టీ చీలికకు ప్రధాన కారణంగా నిలుస్తుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.  

విజయ్‌కి మద్దతు విషయంలో.. 
ప్రభంజనంలా వచ్చి సీఎం పదవిని ఒడిసిపట్టిన టీవీకే చీఫ్‌ విజయ్‌కు బయటి నుంచి మద్దతు ఇవ్వాలని మొదట్నుంచీ షణ్ముగం, వేలుమణి బృందం పట్టుబడుతోంది. ఈ ధోరణిని పళనిస్వామి తప్పుబట్టారు. దీంతో బేధాభిప్రాయాలు మరింత ముదిరి పార్టీలో అంతర్గత చీలికలు పెద్దవైపోయి ఇప్పుడు బహిర్గతమయ్యాయి. పళనిస్వామి గనక పార్టీ ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి శాంతపరచకపోతే పార్టీ శాశ్వతంగా చీలిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సత్యాలయ రామకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. షణ్ముగం వర్గంతో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని, పార్టీ ఐక్యతకు అది అత్యంత కీలకమని పళనిస్వామి భావించకపోతే పార్టీ మరింత బలహీనపడి ద్రవిడ పార్టీల్లో ఏకైక బలమైన పార్టీగా డీఎంకే మాత్రమే కొనసాగుతుందని ఆయన విశ్లేషించారు.  

అవస్థల కడలిలో అన్నాడీఎంకే 
అన్నాడీఎంకేలో చీలికలు ఉంటే ఐదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు. గత కొంతకాలంగా పార్టీ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ చోట్ల పార్టీ గెలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ ప్రదర్శన పేలవంగా ఉంది. తాజా ఎన్నికల్లోనూ పార్టీ 47 స్థానాలకే పరిమితమైంది.  

Advertisement
 
Advertisement
Advertisement