‘ఏ’ అంటే ఆదివాసీలు A for Adivasi, PM Narendra Modi Talks About Gujarat assembly elections | Sakshi
Sakshi News home page

‘ఏ’ అంటే ఆదివాసీలు

Published Mon, Nov 7 2022 5:40 AM

A for Adivasi, PM Narendra Modi Talks About Gujarat assembly elections - Sakshi

అహ్మదాబాద్‌:  ‘‘నాకు ‘ఏ’ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతో గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో గతంలో డాక్టర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లా కప్రాడా తాలూకా నానా పోంధా గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆ గుజరాత్, మై బనావ్యూ చే(ఈ గుజరాత్‌ను నేను తయారు చేశా) అనే కొత్త నినాదానికి మోదీ శ్రీకారం చుట్టారు. ప్రసంగం మధ్యలో ప్రజలతో పలుమార్లు ఈ నినాదాన్ని పలికించారు. రెక్కల కష్టంతో గుజరాత్‌ను తాము తయారు చేశామని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి హృదయం నుంచి వస్తున్న ప్రతి శబ్దం ‘ఆ గుజరాత్, మై బనావ్యూ చే’ అని చెబుతోందన్నారు.

రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజార్టీతో నెగ్గబోతున్నట్లు తనకు సమాచారం అందిందని, పాత రికార్డులను బద్దలు కొట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన రికార్డుల కంటే భూపేంద్ర పటేల్‌(గుజరాత్‌ సీఎం) రికార్డులు బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని వివరించారు. రాష్ట్ర ప్రజల కోసం చాలినంత సమయం కేటాయిస్తానన్నారు.  

రాష్ట్ర ప్రగతి స్ఫూర్తిదాయకం  
ప్రజాసేవ అనేది గుజరాత్‌ సంప్రదాయం, సంస్కృతిలో ఒక భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదివాసీలు, ఇతర వర్గాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌ ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ గుజరాత్‌ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని తెలిపారు. తన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు పనిచేసిన వారంతా అభివృద్ధి కోసం శ్రమించారని ప్రశంసించారు.  

దుష్టశక్తులకు పరాజయమే  
సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్న దుష్టశక్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదని చెప్పారు. అలాంటి శక్తులు రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement