ఒకే ఒక్క తప్పుతో అథఃపాతాళానికి.. | Actor Darshan Has Been In Jail For 2 Years In Renukaswamy Case | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్క తప్పుతో అథఃపాతాళానికి..

Jun 12 2026 4:35 PM | Updated on Jun 12 2026 5:14 PM

Actor Darshan Has Been In Jail For 2 Years In Renukaswamy Case

సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య  శాండల్‌వుడ్‌లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్‌ స్టార్‌గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్‌ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్‌ అగమ్యగోచరమైంది.

2024, జూన్‌ 11న మైసూరులోని ఒక హోటల్‌లో ఉండగా దర్శన్‌ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్‌ మీద బయటకు వచ్చిన దర్శన్‌ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్‌ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు.  

అన్నీ మిస్‌.. మిస్‌  
బెయిలు మధ్యలో దర్శన్‌ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు.

దర్శన్‌ జీవితంలో చీకటిదినం 
2024, జూన్‌ 9 నటుడు దర్శన్‌ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్‌ పేరు వినిపించడంతో పోలీసులు జూన్‌ 11న అరెస్టు చేశారు. జూన్‌ 7న కిడ్నాప్‌ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్‌ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్‌ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. 

తరచూ మలుపులు  
ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్‌కు రాచ మర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్‌ పొందారు. దర్శన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్‌ జైలు పక్షి అయ్యారు. బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement