Viral Video: AAP MLA Gulab Singh Yadav beaten up by his party's workers in Delhi - Sakshi
Sakshi News home page

ఆప్‌ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన సొంత పార్టీ కార్యకర్తలు.. వీడియో వైరల్‌

Nov 22 2022 11:51 AM | Updated on Nov 22 2022 12:45 PM

AAP MLA Gulab Singh Yadav Beaten up by his party's workers Viral Video - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. డిసెంబర్‌ 4న ఎన్నికలు జరగనున్నాయి. పోటీలో మహిళల అభ్యర్థులే అధికంగా ఉన్నారు. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యర్ధులపై విమర్శలు ఎక్కుపెడుతూ ఎవరికి వారే ప్రచారంలో దూసుకుపోతున్నారు.

కాగా మున్సిపోల్స్ ఎన్నికల వేళ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేయడం కలకలం రేపుతోంది. మటియాలా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌ను జనాలు తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే యాదవ్ సోమవారం శ్యామ్ విహార్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ విషయంలో వాగ్వాదం చెలరేగడంతో యాదవ్‌ పట్ల కొంతమంది ఆప్ కార్యకర్తలు ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
చదవండి: తిహార్ జైలులో ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్.. అతను ఫిజియో థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్..

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇందులో ఆప్ కార్యకర్తలు గులాబ్ సింగ్ యాదవ్‌ను కాలర్‌తో పట్టుకోవడం, చేతులతో దాడి చేయడం కనిపిస్తుంది. చివరకు తన సొంత పార్టీ కార్యకర్తల ఆగ్రహం నుంచి తనను తాను రక్షించుకోవడానికి పరుగులు తీయడం స్పష్టంగా  తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేపై దాడి ఘటనపై ఇప్పటి వరకు ఆప్‌ స్పందించలేదు. 

అయితే ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నందుకు సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేలను కొట్టినట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. ఢీల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, తన అవినీతి ఎమ్మెల్యేలందరికీ ఇక్కొక్కరిగా ఇదే జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే గులాబ్‌ సింగ్‌ కొట్టిపారేశారు. టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. తనపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆరోపించారు. తాను చావ్లా పోలీస్ స్టేషన్‌లో ఉండగా.. ఆ వార్డుకు చెందిన బీజేపీ కార్పొరేటర్, వారి అభ్యర్థిని పీఎస్‌లో చూసినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement