40 లక్షలకు చేరువలో..

83341 New Cases India COVID-19 Count To Over 40 Lakh - Sakshi

 వరుసగా రెండో రోజు.. 80 వేలకు పైగా కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం తాజాగా 83,341 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,36,747కు చేరుకుంది. రెండు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 66,659 మంది కోలుకోగా, మరో 1,096 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 68,472కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 8 రోజుల నుంచి దేశంలో వరుసగా రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 29,70,492కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,31,124గా ఉంది.  రికవరీ రేటు  77.15 శాతానికి పెరిగిందని కేంద్రం తెలిపింది.

జూన్‌ తర్వాతే వ్యాక్సిన్‌
జెనీవా/మాస్కో : వచ్చే ఏడాది జూన్‌ వరకు కరోనా వ్యాక్సిన్‌ విస్తృతంగా అందుబాటులోకివచ్చే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. అన్ని ప్రయోగాలను దాటుకొని వ్యాక్సిన్‌ ఎంత సమర్థంగా ఎంత సురక్షితంగా పని చేస్తుందో తేలడానికి సమయం పడుతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరెట్‌ హ్యారిస్‌ చెప్పారు. ఇప్పటివరకు తుది దశ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్‌లన్నీ సమర్థవంతంగా పని చేస్తాయని నిర్ధారణ కాలేదని జెనీవాలో  అన్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం ఈ టీకాలేవీ 50% కూడా సురక్షితం కాదని మార్గరెట్‌ చెప్పారు. రెండు నెలల్లోనే మానవ ప్రయోగాలు పూర్తి చేసి వ్యాక్సిన్‌కు రష్యా అనుమతులు మంజూరు చేయడం, అమెరికా కూడా నవంబర్‌కి వ్యాక్సిన్‌ సిద్ధంగా చేస్తామని వెల్లడించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రష్యా వ్యాక్సిన్‌ సురక్షితమే..
రష్యా  వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ సురక్షితమేనని లాన్సెట్‌ జర్నల్‌ ఓ పరిశోధనను వెలువరించింది. మొత్తం 76 మందిపై జరిపిన ట్రయల్స్‌ వివరాలను వెల్లడించింది. ఈ ట్రయల్స్‌లో తీవ్రమైన సైడ్‌ ఎఫెక్టులేమీ కనపడలేదని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top