తిరువొత్తియూరు: చెన్నై వేళచ్చేరిలో వృద్ధురాలిపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చెన్నై వేళచ్చేరికి చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు బుధవారం తెల్లవారుజామున మడిపాక్కం ప్రాంతం నుంచి వేళచ్చేరి వైపు నడిచి వెళుతోంది. బైకుల్లో వచ్చిన ఐదుగురు యువకులు వాకింగ్ ముగించుకుని వస్తున్న ఆమెతో పరిచయం చేసుకుని బైకులో ఎక్కించుకుని జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడ ఐదుగురు యువకులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పారిపోయారు. రక్తగాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న ఆమెను గురువారం ఉదయం అటుగా వెళుతున్న వారు చూసి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. వేళచ్చేరి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఎగ్మూర్‌లోని ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.
వేళచ్చేరి పోలీసులు, బిహార్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల బాలుడు సహా ముగ్గురు ఇతర రాష్ట్ర కారి్మకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా, వారు ఆ ప్రాంతంలోని హోటళ్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను చూసి వెంబడించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వారు నేరం అంగీకరించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారణను వేగవంతం చేశారు.


