1498 మే 20. కేరళ తీరంలోని కాలికట్ (కోజికోడ్) సమీపంలో ఉన్న ‘కప్పకడవు’ అనే చిన్న గ్రామం చరిత్రపుటల్లోకి ఎక్కిన రోజు అది. వాస్కోడా గామా (Vasco da Gama ) అనే పోర్చుగీసు నావికుడు సముద్ర మార్గాన భారత్ చేరిన రోజు అది. అప్పటి నుంచి యూరప్ నుంచి భారత్‌కు సముద్రమార్గం కనిపెట్టిన వాడిగా వాస్కోడా గామా ప్రసిద్ధి చెందాడు.
భారత దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం కోసం 1497 జూలై 8న పోర్చుగల్ రాజు మాన్యుయెల్ –1 ఆదేశంతో లిస్బన్ నుండి వాస్కోడా గామా బయలుదేరాడు. సుమారు 170 మంది సిబ్బందితో, సావో గాబ్రియేల్, సావో రాఫెల్, బెర్రియో వంటి నౌకలు ఈ ప్రయాణంలో పాల్గొన్నాయి. ప్రయాణం ఏమాత్రం సాఫీగా సాగలేదు. భయంకరమైన తుపానులు, ఆహార కొరత, స్కర్వీ వంటి వ్యాధులు నావికులను వేధించాయి. సముద్రంలో నెలల తరబడి గడపడం వల్ల సగానికి పైగా సిబ్బంది మరణించారు. నావికులు భయంతో వెనక్కి వెళ్దామని గొడవ చేసినా, గామా మొండితనంతో ముందుకు సాగాడు. తిరుగుబాటు చేసినవారిని ఇనుప గొలుసులతో బంధించి మరీ తన లక్ష్యం వైపు ప్రయాణించాడు. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, మొంబాసా వంటి ప్రాంతాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాడు. అతడు భారత్‌కు చేరుకోవడంలో స్థానిక నావికుల సముద్రమార్గ అవగాహన కీలక పాత్ర పోషించింది. ఆఫ్రికాలోని మలిండిలో అతడికి ఒక గుజరాతీ నావికుడు (కాంజీ మలమ్), అరబ్ నావికుడు (ఇబ్న్ మాజిద్)ల సహాయం లభించింది. రుతుపవనాల గమనాన్ని గుర్తించడంలో ఈ నావికులకు ఉన్న అవగాహనే గామాను క్షేమంగా కాలికట్ తీరానికి చేర్చింది.

కాలికట్ పాలకుడు జామొరిన్ (మాన విక్రమ) గామాను
ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. అయితే పోర్చుగీసువారు కానుకలుగా సమర్పించిన బట్టలు, టోపీలు, పగడపు దండలు, చక్కెర, తేనె వంటి అల్పమైన వస్తువులను చూసి అతడు పెదవి విరిచాడు. నిజానికి జామొరిన్ ఆ కానుకలను చూసి జాలిపడి, గామా చేసిన కష్టభరితమైన ప్రయాణాన్ని గౌరవిస్తూ వ్యాపారానికి అనుమతి ఇచ్చాడు. మిరియాలు, ఇతర మసాలా దినుసులు, క్యాలికో వస్త్రాల వ్యాపారం చేసుకునే వీలు కల్పించాడు. గామా ఇక్కడి నుంచి తాను వచ్చిన మూడు నౌకలలో సుగంధ ద్రవ్యా లను, ఇతర విలువైన వస్తువులను తీసుకుని తిరిగి పోర్చుగల్ వెళ్లి అమ్మడంతో ఈ యాత్ర చేయడానికి అయిన ఖర్చుకు 60 రెట్ల లాభం సమకూరింది. అందుకే మరోసారి ఇండియా ప్రయాణ మయ్యాడు.
వ్యాపారం మాత్రమే లక్ష్యం కాదు
వాస్కోడా గామా రెండో ప్రయాణం (1502) అత్యంత క్రూరంగా సాగింది. అరేబియా సముద్రంపై పోర్చుగీసు ఆధి పత్యం సాధించడానికి గామా హింసను ఆశ్రయించాడు. సము ద్రంలో వెళ్తున్న అరబ్ నౌకలపై దాడులు చేయడం, ప్రయాణికు లను చంపడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జామొరి న్ను తన సైనిక శక్తితో బలవంతంగా సంధికి ఒప్పించాడు. అంతు లేని సంపదతో తన స్వదేశం తిరిగి వెళ్లాడు.
మొత్తానికి ఈ సముద్ర మార్గ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రను మలుపు తిప్పింది. పోర్చుగీసువారి విజయంతో డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్లు భారత్‌కు రావడం మొదలుపెట్టారు. వ్యాపారం కోసం వచ్చిన వీరు, క్రమంగా దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఆక్రమణలకు పాల్పడ్డారు. చివరిసారిగా 1524లో పోర్చుగీసు భారత వైస్రాయ్‌గా వచ్చిన వాస్కోడా గామా, కొచ్చిన్ లోనే అనా రోగ్యంతో మరణించాడు. అతడి భౌతిక కాయాన్ని తర్వాత పోర్చు గల్‌కు తరలించారు. వాస్కోడా గామా వేసిన సముద్రపు బాట 450 ఏళ్ల భారత బానిసత్వానికి దారితీసింది. అంతులేని సంపద ఈ మార్గంలోనే యూరప్‌కు ప్రవహించింది. దేశం పేదదిగా మిగిలిపోయింది.
-ఎడిటోరియల్ టీమ్


