భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు | 2 India-Bound LPG Tankers Cross Strait Of Hormuz | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు

Mar 30 2026 5:37 AM | Updated on Mar 30 2026 5:37 AM

2 India-Bound LPG Tankers Cross Strait Of Hormuz

రేపు, ఎల్లుండి రాక

న్యూఢిల్లీ: ఇరాన్‌ అనుమతితో హార్మూజ్‌ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ ట్యాంకర్‌ నౌకలు ‘బీడబ్ల్యూ ఈఎల్‌ఎం’, ‘బీడబ్ల్యూ టీవైఆర్‌’వేగంగా భారత్‌ దిశగా కదులుతున్నాయి. భారతీయ జెండాతో వస్తున్న ఈ నౌకలు శనివారం హార్మూజ్‌ను దాటేసి ‘గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌’దిశగా ముందుకెళ్తున్నాయని నౌకల ట్రాకింగ్‌ సంస్థ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ‘బీడబ్ల్యూ టీవైఆర్‌’నౌక మార్చి 31వ తేదీకల్లా ముంబైకి చేరుకునే అవకాశముంది. ‘బీడబ్ల్యూ ఈఎల్‌ఎం’నౌక ఏప్రిల్‌ ఒకటో తేదీన న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకునే ఆస్కారముందని భారత ప్రభుత్వ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.

ఈ రెండు నౌకలు 94,000 మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ నిల్వలు దేశ ఒక రోజు ఎల్పీజీ అవసరాలను తీరుస్తాయి. ఇప్పటికే నాలుగు భారత ఎల్పీజీ నౌకలు హార్మూజ్‌ను దాటి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. మార్చి 16–17 తేదీల మధ్య ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు ఉమ్మడిగా 92,712 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. మార్చి 26–28 తేదీల మధ్య పైన్‌ గ్యాస్, జగ్‌ వసంత్‌ నౌకలు 92,612 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చాయి.

భారత 60 శాతం వంటగ్యాస్‌ అవసరాలను గల్ఫ్‌ దేశాలు తీరుస్తున్నాయి. గత ఏడాది భారత్‌లో 3.315 కోట్ల టన్నుల ఎల్పీజీని ప్రజలు వినియోగించారు. హార్మూజ్‌ గుండా ఇప్పుడు సరకు రవాణా నౌకల రాకపోకలు దాదాపు తగ్గిపోవడంతో భారత అవసరాలను కొంతమేరకు అమెరికా, అర్జెంటీనాలు తీరుస్తున్నాయి. 485 మంది నావికులతో భారతీయ జెండాతో 18 నౌకలు ఇంకా పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నాయని భారత అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement