Vande Mataram ‘వందేమాతరం’ నినాదం లేని స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఊహించలేం. బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా గొప్ప స్ఫూర్తిని, ఉద్యమ కాంక్షను వందేమాతర గేయం భారతీయుల్లో రగిలించింది. అదే తరువాత మన జాతీయ గేయం అయ్యింది. దీన్ని బంకించంద్ర ఛటర్జీ (ఛటోపాధ్యాయ) రచించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆర్థికంగా కొల్లగొట్టడం, సాంస్కృతికంగా బలహీనపరచడం ఆయన్ని వేదనకు గురిచేసింది. అందుకే ‘ఆనంద్ మఠ్’ నవల రాశారాయన. ఈ నవలలో సన్యాసుల స్వాతంత్య్ర సమర శంఖ నినాదం వందే మాతరం అవుతుంది. ఈ గేయాన్ని 1875 నవంబరు 7న బంకించంద్ర రాశారు. తరువాత ‘ఆనంద్ మఠ్’లో పొందుపరిచారు. ఈ నవంబర్ 7తో వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తవుతాయి (150 years of iconic Vande Mataram). వందే మాతర వేడుకలను అధికారికంగా వచ్చే ఏడాది నవంబర్ 7 వరకూ కేంద్రం నిర్వహించనుంది.
బంకించంద్ర ‘ఆనంద్ మఠ్ రాయడానికి నూరేళ్లకు పూర్వం 1773లో కొందరు సన్యాసులు ఆంగ్లేయుల మీద ఉద్యమించారు. 1770 ప్రాంతంలో క్షామంతో ప్రజానీకం అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో లక్షల మందికి పైగా చనిపోయారు. బ్రిటిష్ ఈస్ట్‌ఇండియా కంపెనీ పాలకుల పన్నుల పీడనకు వ్యతిరేకంగా హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఏకమై చారిత్రాత్మక తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఘట్టాలను కూర్చిన ఆనంద్ మuЇ 1882లో ప్రచురితమైంది. 1884 ఏప్రిల్ 8న బకించంద్ర మరణించాక 1896లో రవీంద్రనాథ్ టాగూర్ ఆ గేయానికి స్వరకల్పన చేసి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు. అప్పట్నుంచి వందే మాతరం అందరి నోళ్ళలో నినాదంగా మారింది. విభజించు–పాలించు సిద్ధాంతంతో హిందువులను, ముస్లిము లను విడదీసేందుకు వైస్రాయ్ లార్డ్ కర్జన్ 1905 జూలై 20నబెంగాల్ విభజన ప్రకటన చేశాడు. తూర్పు బెంగాల్, పశ్చిమబెంగాల్‌గా ఈ విభజన 1905 అక్టోబర్ 16న అమలులోకి వచ్చింది. ఈ విభజనకు వ్యతిరేక ఉద్యమం 1905 ఆగస్ట్ 7నే ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ‘వందేమాతర ఉద్యమం’ అని అశ్వనీకుమార్‌దత్త నామకరణం చేశారు.
వందేమాతరం అంటే ‘మాతృభూమికి నమ స్కారం’ అని అర్థం. ఈ ఉద్యమంలో ప్రజలు వందేమాతరం గేయాన్ని ఆలపించటం, ఒకరినొకరు వందేమాతరం అని పలకరించుకోవడం వల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అని పిలిచారు. ఈ ఉద్యమంలోనే విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలానే నిర్ణయం తీసుకోవడం వలన దీనికి స్వదేశీ ఉద్యమం అనే పేరు కూడా వచ్చింది. ఉద్యమం దెబ్బకు బ్రిటిష్ వాళ్లు దిగివచ్చి బెంగాల్ విభజనను 1911లో రద్దుచేశారు. దీంతో వందేమాతర ఉద్యమం ఆగింది కానీ... తరువాత స్వాత్రంత్య ఉద్యమంలోని ప్రతిఘట్టంపైనా దాని ప్రభావం పడింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక, 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ‘వందేమాతరం’ గేయాన్ని ‘జనగణమన’తో సమానంగా గౌర విస్తూ జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది.
– నర్సింగు కోటయ్య హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్
(వందేమాతరం గేయానికి 150 ఏళ్లు)


