breaking news
Bankim Chandra Chattopadhyay
-
పరతంత్య్రాన్ని పారదోలిన గేయం
Vande Mataram ‘వందేమాతరం’ నినాదం లేని స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఊహించలేం. బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా గొప్ప స్ఫూర్తిని, ఉద్యమ కాంక్షను వందేమాతర గేయం భారతీయుల్లో రగిలించింది. అదే తరువాత మన జాతీయ గేయం అయ్యింది. దీన్ని బంకించంద్ర ఛటర్జీ (ఛటోపాధ్యాయ) రచించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆర్థికంగా కొల్లగొట్టడం, సాంస్కృతికంగా బలహీనపరచడం ఆయన్ని వేదనకు గురిచేసింది. అందుకే ‘ఆనంద్ మఠ్’ నవల రాశారాయన. ఈ నవలలో సన్యాసుల స్వాతంత్య్ర సమర శంఖ నినాదం వందే మాతరం అవుతుంది. ఈ గేయాన్ని 1875 నవంబరు 7న బంకించంద్ర రాశారు. తరువాత ‘ఆనంద్ మఠ్’లో పొందుపరిచారు. ఈ నవంబర్ 7తో వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తవుతాయి (150 years of iconic Vande Mataram). వందే మాతర వేడుకలను అధికారికంగా వచ్చే ఏడాది నవంబర్ 7 వరకూ కేంద్రం నిర్వహించనుంది.బంకించంద్ర ‘ఆనంద్ మఠ్ రాయడానికి నూరేళ్లకు పూర్వం 1773లో కొందరు సన్యాసులు ఆంగ్లేయుల మీద ఉద్యమించారు. 1770 ప్రాంతంలో క్షామంతో ప్రజానీకం అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో లక్షల మందికి పైగా చనిపోయారు. బ్రిటిష్ ఈస్ట్ఇండియా కంపెనీ పాలకుల పన్నుల పీడనకు వ్యతిరేకంగా హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఏకమై చారిత్రాత్మక తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఘట్టాలను కూర్చిన ఆనంద్ మuЇ 1882లో ప్రచురితమైంది. 1884 ఏప్రిల్ 8న బకించంద్ర మరణించాక 1896లో రవీంద్రనాథ్ టాగూర్ ఆ గేయానికి స్వరకల్పన చేసి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు. అప్పట్నుంచి వందే మాతరం అందరి నోళ్ళలో నినాదంగా మారింది. విభజించు–పాలించు సిద్ధాంతంతో హిందువులను, ముస్లిము లను విడదీసేందుకు వైస్రాయ్ లార్డ్ కర్జన్ 1905 జూలై 20నబెంగాల్ విభజన ప్రకటన చేశాడు. తూర్పు బెంగాల్, పశ్చిమబెంగాల్‌గా ఈ విభజన 1905 అక్టోబర్ 16న అమలులోకి వచ్చింది. ఈ విభజనకు వ్యతిరేక ఉద్యమం 1905 ఆగస్ట్ 7నే ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ‘వందేమాతర ఉద్యమం’ అని అశ్వనీకుమార్దత్త నామకరణం చేశారు. వందేమాతరం అంటే ‘మాతృభూమికి నమ స్కారం’ అని అర్థం. ఈ ఉద్యమంలో ప్రజలు వందేమాతరం గేయాన్ని ఆలపించటం, ఒకరినొకరు వందేమాతరం అని పలకరించుకోవడం వల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అని పిలిచారు. ఈ ఉద్యమంలోనే విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలానే నిర్ణయం తీసుకోవడం వలన దీనికి స్వదేశీ ఉద్యమం అనే పేరు కూడా వచ్చింది. ఉద్యమం దెబ్బకు బ్రిటిష్ వాళ్లు దిగివచ్చి బెంగాల్ విభజనను 1911లో రద్దుచేశారు. దీంతో వందేమాతర ఉద్యమం ఆగింది కానీ... తరువాత స్వాత్రంత్య ఉద్యమంలోని ప్రతిఘట్టంపైనా దాని ప్రభావం పడింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక, 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ‘వందేమాతరం’ గేయాన్ని ‘జనగణమన’తో సమానంగా గౌర విస్తూ జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది.– నర్సింగు కోటయ్య హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్(వందేమాతరం గేయానికి 150 ఏళ్లు) -
మహోజ్వల భారతి: బంకిమ్ని బయటే నిలబెట్టేశారు!
బంకిమ్ చంద్ర చటర్జీ మిడ్నాపూర్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ పాఠశాలలో ఉన్నప్పుడే ఆయన తన తొలి కవిత రాశారు. అక్కడ ఎఫ్.టీడ్ అనే ఉపాధ్యాయుడు బంకిమ్‌బాబును బాగా అభిమానించేవాడు. కారణం, చిన్నతనంలోనే బంకిమ్బాబు చదువులో చూపిన చురుకుదనం. టీడ్కు, జిల్లా మేజిస్ట్రేట్ మాలెట్కు మంచి పరిచయం ఉండేది. ఓసారి పిల్లలతో పాటు, బంకిమ్‌బాబును కూడా మాలెట్ ఇంటికి తీసుకెళ్లాడు టీడ్. కొంతసేపు గడిచిన తర్వాత ఆంగ్లేయుడైన టీడ్, తన పిల్లలను మాత్రం మాలెట్ తేనీటి కోసం లోపలికి పిలిచాడు. బంకిమ్‌బాబును పట్టించుకోలేదు. అది సహజంగానే బంకిమ్‌బాబును బాధించింది. అదే సమయంలో ఇంగ్లిష్‌వాళ్ల మనస్తత్వం ఏమిటో ఆ వయసులోనే అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా ఆ సంఘటన కల్పించింది. బంకిమ్బాబు చదువు ప్రశాంతంగా సాగలేదు. అప్పుడే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఎగసింది. అలాగే ఆ రోజుల్లో అంతగా ఇంగ్లిష్ చదువుకున్నా కూడా ఆయన జీవితం నల్లేరు మీద బండిలా సాగలేదు. కంపెనీ పాలనలో గానీ, ఆ తరువాత రాణి పాలనలో గానీ ఎంత పెద్ద చదువు చదివినా అది ఇంగ్లిష్ చదువే అయినా, ఇంగ్లిష్ వారు భారతీయుల పట్ల వ్యవహరించే తీరు ఆయకు నచ్చేది కాదు. ఉద్యోగిగా సంకెళ్ల మధ్య ఉన్నప్పటికీ ఆయన తన ప్రవృత్తిని మాత్రం స్వేచ్ఛగా ఉండనిచ్చారనిపిస్తుంది. ఉద్యోగం, సామాజిక పరిస్థితుల నుంచి సృజనాత్మ కతను రక్షించుకున్నారనిపిస్తుంది. ఫలితమే ‘అనందమఠ్ వంటి మహోన్నత రచన. అందులోనిదే వందేమాతర గీతం. నేడు (జూన్ 26) బంకిమ్ చంద్ర చటర్జీ జయంతి. ఆయన 1838 లో వంగభూమిలోని కాంతల్ పడా (ఇరవైనాలుగు పరగణాల జిల్లా) లో జన్మించారు. తండ్రి యాదవ్చంద్ర, తల్లి దుర్గాదేవి. (చదవండి: స్వతంత్ర భారతి... భారత్–పాక్ యుద్ధం) -
మహాకవికి దక్కని గుర్తింపు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్ అని ప్రబోధించిన మహాకవి గురజాడకు తగిన గౌరవం దక్కడం లేదు. విద్యలకు నిలయమైన విజయనగరంలో ఆయన జన్మించడం వల్ల జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నైతిక విలువలు పతనమవుతున్న ఈ రోజుల్లో గురజాడ జయంతి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఉపాన్యాసాలిచ్చే నాయకులు కోకొల్లలు. అయితే గత ఏడాది జిల్లాలో నిర్వహించిన గురజాడ 150వ జయంత్యుత్సవాల్లో జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు పలు హమీలు ప్రకటించి నేటికి ఏడాది గడుస్తున్నా అందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఉత్సవాల అనంతంరం వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారంటే ఆయనకు ఇచ్చే గౌరవం ఏపాటిదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. హామీలు ఇవే.... గత ఏడాది జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 150వ జయంత్యుత్సవాల్లో గురజాడ పేరిట ఉన్న గ్రంథాలయం ఆవరణలో రూ.కోటి వ్యయంతో కళాభారతి ఏర్పాటు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయింపు. గురజాడ నివసించిన ఇంటిని రూ.15 లక్షల నిధులతో మ్యూజియంగా తీర్చిదిద్దడం. ప్రధానంగా గురజాడ పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ప్రజాప్రతినిధు లు ప్రకటించిన హమీలు నెరవేర్చాలని గడిచిన ఏడాది కాలంలో పలు సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యం లో ఎన్ని ఆందోళనలు చేసినా ఏఒక్కరికి పట్టడం లేదు. తెలుగువారంటే అంత చులకనా...? దేశ భాషలందు తెలుగులెస్స అన్నది కాగితాలకే పరిమితమవుతోందన్న విషయం గురజాడ కు ఇచ్చే గౌరవంతో స్పష్టంగా అర్థమవుతోంది. ఇతర రాష్ట్రాల రచయితలకు, కవులకు దక్కిన గౌరవం మన తెలుగు వారికి దక్కడం లేదన్నది సుస్పష్టం. గతంలో కవులు, రచయితలు, సాహితీవేత్తల పేరిట పలు పోస్టల్ స్టాంపులు విడుదల చేశారు. వాటిలో 1969లో బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ, ఉర్దూ రచయిత మీర్జా గాలిబ్, 1976లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హిందీ రచయిత్రి సుభద్రాకుమారి చౌహాన్, బెంగాల్ రచయిత సూర్యకాంత్ త్రిపాఠీ, 1978 లో నానాలాల్ దల్పత్ రామ్కవి, 1998లో మరాఠీ రచయిత విష్ణుశేఖరం ఖండేకర్ ఇలా పలువురు రచయితల పేర్ల మీద పోస్టల్ స్టాంపులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే సమాజాన్ని ప్రభావితం చేసే మూఢాచారాలపై తన సాహిత్యంతో పోరాడిన గురజాడ పేరిట స్టాంపు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్న సందేహాలు నెలకొంటున్నాయి. ఈ విషయంలో మన ప్రజా ప్రతినిధుల ప్రయత్నం కనీసం లేకపోవడం ప్రధాన కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుంటారా...? లేదా...? అన్నది వేచి చూడాల్సిందే.


