కోస్గి రూరల్/కొత్తపల్లి(మద్దూరు): కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించడంతో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిర్వాహకులపై అదనపు కలెక్టర్ శ్రీను మండిపడ్డారు. మంగళవారం కోస్గి, మండలంలోని మీర్జాపూర్, గుండుమాల్, మద్దూరు మండలం దమ్‌గాన్‌పూర్, పల్లెర్లలోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి సరిపడా లారీలు వచ్చినా తరలింపులో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిర్వాహకులను ప్రశ్నించారు. పాఠశాల ఆవరణలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ఎవరి అనుమతి తీసుకొని ఇచ్చారని ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1లోగా కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. అలాగే ఆయా కేంద్రాల్లోని స్టాక్ రిజిస్లర్లను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా హమాలీల సంఖ్య పెంచి ధాన్యాన్ని తరలించాలని సూచించారు. ధాన్యం సేరకణ ప్రక్రియ, ట్యాబ్ ఎంట్రీలు వేగంగా పూర్తిచేసి డబ్బులు రైతుల ఖాతాల్లో త్వరగా జమయ్యేలా చూడాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రా న్ని మండల అధికారులు పర్యవేక్షించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే మద్దూరు మండలంలోని జాదరావుపల్లి రైస్‌మిల్లులో ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించి మిల్లు యజమానితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల నుంచి వచ్చిన లారీల్లోని ధాన్యం త్వరగా దించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ మహేశ్‌గౌడ్, ఏఓ ప్రవీణ్‌కుమార్, మహిళా సమైఖ్య అధ్యక్షురాలు మహేశ్వరి, జీహెచ్‌ఎం జనార్దన్, ఆయా గ్రామాల బుక్‌కీపర్లు తదితరులు పాల్గొన్నారు.


