నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నారాయణపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రగతిపై జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ సుధాకర్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇంది రమ్మ పథకం కింద రూ.5 లక్షలు మంజూరు చేస్తోందని, అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల వారీగా మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు మంజూరైన ఇళ్లు, గృహ ప్రవేశాలకు సిద్ధమైన ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ లక్ష్యంలో ధన్వాడ 55 శాతం ఉండగా.. నారాయణపేట పట్టణం 34 శాతంలో ఉందని, పట్టణంలో ఇంత తక్కువ శాతం ఉండటానికి గల కారణాలపై వివరణ కోరారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. జూన్ 2 వరకు వీలైనన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలన్నారు. ఎంపీడీఓలు, పుర కమిషనర్, ఎంపీఓలు, హౌసింగ్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో..
కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి జూన్ 2 వరకు పెద్ద సంఖ్యలో గృహ ప్రవేశాలకు ఇళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం, పట్టణం చివరి స్థానంలో ఉందని, కొత్తపల్లి మండలంలో లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఇళ్ల వారీగా తనకు నివేదిక అందజేయాలని ఎంపీడీఓను ఆదేశించారు.అలాగే కోస్గి మున్సిపాలిటీలోని 3, 4, 11, 16 వార్డుల్లో ఇళ్ల నిర్మాణాలు 40 శాతమే పూర్తి చేశారని, వేగం పెంచాలని పుర కమిషనర్ నాగరాజును ఆదేశించారు. గుండుమాల్ మండలంలో మాత్రం లక్ష్యం 78 శాతానికి చేరిందని 100 శాతానికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


