ముందుకు.. వెనక్కి.. | - | Sakshi
Sakshi News home page

ముందుకు.. వెనక్కి..

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కృష్ణాతీరంలోని సుందర దృశ్యాలు, నల్లమల అడవి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన హెలీ టూరిజం కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్లమల, సోమశిల ప్రాంతంలోనే హెలీ టూరిజానికి అడుగులు పడగా, ఈ కార్యక్రమం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. అసైన్డ్‌ భూముల వివాదంలో సంబంధిత భూనిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. హెలీప్యాడ్‌ నిర్మాణ పనులపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన కీలకమైన ప్రాజెక్ట్‌లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలోనే మొదటిసారిగా సోమశిలలో..

కృష్ణాతీరంలోని సుందరమైన ప్రదేశాలు, నదీ గర్భంలోని దీవులు, నల్లమల అడవి అందాలను విహంగ వీక్షణం చేసేందుకు వీలుగా ప్రభుత్వం హెలీటూరిజం ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్‌ నుంచి సోమశిల వరకు హెలికాప్టర్‌లో చేరుకుని ఇక్కడి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్‌ పయనమయ్యేలా టూర్‌ ప్లాన్‌ చేపట్టింది. హెలికాప్టర్‌లో ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పాటు పర్యటించేందుకు 1.40 లక్షలను చార్జ్‌ చేయనున్నారు. రెండు రోజుల ప్యాకేజీలో ఒకరోజు శ్రీశైలంలో, మరొకరోజు సోమశిలలో స్టే చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెలీ టూరిజం ప్యాకేజీని బుక్‌ చేసుకునే సందర్శకులకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వీఐపీ తరహాలో దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు విడిది, భోజన వసతి కల్పించనున్నారు. అయితే హెలీ టూరిజం కార్యక్రమానికి కీలకమైన హెలీప్యాడ్‌ నిర్మాణాన్ని సోమశిల గ్రామంలో చేపట్టారు. ఏప్రిల్‌ 9నే హెలీ టూరిజం ప్రారంభోత్సవానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి ముందే బ్రేక్‌ పడటంతో హెలీ టూరిజం ప్రాజెక్ట్‌ ముందుకు సాగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి.

అమరగిరిలో ఊసేలేని కాటేజీల నిర్మాణం..

కృష్ణాతీరంలోని సోమశిలతో పాటు అమరగిరి సమీ పంలోని ద్వీపంలోనూ ప్రభుత్వం నూతనంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమరగిరి ద్వీప ంలో 8 ఎకరాల విస్తీర్ణంలో వెల్‌నెస్‌, స్పిరిట్చువల్‌ ప్రాజెక్ట్‌ కోసం గతేడాది ఆగస్టులోనే పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.45.84 కోట్ల వ్యయంతో వెల్‌నెస్‌ సెంటర్‌లో కాటేజీల నిర్మాణంతో పాటు కెఫెటేరియా, యోగా డెస్క్‌, స్పా సెంటర్‌, ఇండోర్‌ గేమ్స్‌, స్విమ్మింగ్‌పూల్‌, ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌, వ్యూపాయింట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లోనూ కేటాయించిన స్థలం విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్‌, పర్యాటక శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో వెల్‌నెస్‌, రిట్రీట్‌ ప్రాజెక్ట్‌ అటకెక్కింది.

అసైన్డ్‌ భూముల్లో ఏర్పాటుతో..

హెలీటూరిజం ప్రాజెక్ట్‌ కింద హెలీప్యాడ్‌ నిర్మాణానికి అధికారులు కృష్ణాతీరంలోని సోమశిల గ్రామాన్ని ఎంచుకున్నారు. కొల్లాపూర్‌ మండలంలోని సోమశిలలోని రైతుల అసైన్డ్‌ భూముల్లో హెలీప్యాడ్‌ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రామంలోని సర్వే నంబర్‌ 54లో సుమారు ఎకరం స్థలంలో హెలీప్యాడ్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కనీస పరిహారం లేకుండా చట్టవిరుద్ధంగా హెలీప్యాడ్‌ పనులు చేపడుతున్నారని, నిర్వాసిత రైతులు దేవ సుంకన్న, పెంటయ్య, పుల్లయ్య, జాముడు, సాయన్న తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెలీప్యాడ్‌ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు విధించింది. ఈ క్రమంలో హెలీప్యాడ్‌ నిర్మాణ పనులతో పాటు హెలీటూరిజం ప్రాజెక్ట్‌ కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది.

నల్లమల హెలీ టూరిజంపై నీలినీడలు

హైదరాబాద్‌–సోమశిల హెలికాప్టర్‌ రైడ్‌ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం

ఈనెల 9నే ప్రారంభానికి సిద్ధమైన పర్యాటకశాఖ అధికారులు

హైకోర్టు తీర్పుతో హెలిప్యాడ్‌ పనులకు బ్రేక్‌

హెలీ టూరిజం అమలుపై సందిగ్ధత

Advertisement
 
Advertisement
Advertisement