85 శాతం ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

85 శాతం ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ లక్ష్యం

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

పెట్రోల్‌బంక్‌ నిర్వహణ భేష్‌..

కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా సమగ్ర, పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని.. జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతం చేసి మూడు రోజుల్లో 85 శాతం మ్యాపింగ్‌ చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీనుతో కలిసి ఎస్‌ఐఆర్‌, సాదా బైనామాపై తహసీల్దార్లు, డీటీలు, సూపర్‌వైజర్లు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 85 శాతం ఎస్‌ఐఆర్‌ పూర్తి కావాలని.. లేనిపక్షంలో సంబంధిత అధికారులు, ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఓ నంబర్‌ 74, 76 ప్రకారం సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 2,075 సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయని.. 2,674 సర్వేనంబర్లను విచారణ చేసి నెలాఖరు నాటికి పరిష్కరించాలని.. తిరస్కరిస్తే తగిన కారణాలను స్పష్టంగా పేర్కొనాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను తహసీల్దార్లను ఆదేశించారు. చివరగా భూ భారతి పెండింగ్‌ దరఖాస్తులపై చర్చించి క్లియర్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తి చేయాలి..

కలెక్టరేట్‌ నిర్మాణ పనులు మే నెలాఖరుకు పూర్తిచేసి జూన్‌ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ ప్రియాంక ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నూతన భవనంలోని కలెక్టర్‌ చాంబర్‌, సమావేశ మందిరం, వివిధ సెక్షన్‌ గదులలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. జూన్‌ 2 వరకు పనులు పూర్తికావడం సాధ్యం కాదని, జులైలో పూర్తవుతాయని ఆర్‌అండ్‌బీ అధికారులు వివరించగా.. పనుల్లో వేగం పెంచి మే నెలాఖరుకు పూర్తి చేసే ప్రయత్నం చేయాలని కోరారు. భవన నిర్మాణానికి నిధులు సరిపోవడం లేదని.. అదనపు నిధులు కావాలని అధికారులు కోరగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని బదులిచ్చారు. గ్రీనరీ, వాహనాల పార్కింగ్‌, అంతర్గత రహదారుల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఆమె వెంట ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ. వెంకటరమణ, డీఈ రాములు, ఏఈలు, సూపర్‌వైజర్లు ఉన్నారు.

జిల్లాకేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్‌ బంక్‌కు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉందని.. లాభాల బాటలో నడుస్తుందని, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌గా తాను పలు పత్రికల్లో పాజిటివ్‌ కథనాలు ప్రచురింప చేయించిన విషయాన్ని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక గుర్తుచేశారు. ఇప్పుడు జిల్లాకు కలెక్టర్‌గా వచ్చానని.. కొత్త ఆలోచనలతో మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుడదామని సూచించారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ భవనంలో జరిగిన జిల్లా మహిళా సమాఖ్య ఈసీ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత నెలలో జరిగిన సమావేశ వివరాలపై సమీక్షించి ఎస్‌హెచ్‌జీల పనితీరు, జిల్లా సమాఖ్య, పెట్రోల్‌ బంక్‌ లావాదేవీలు, బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, సెర్ప్‌ పీఎం బాలస్వామి, డీపీఎం గోవింద్‌, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు అరుంధతి, సుజాత, కోశాధికారి అంజమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement