కోడేరు మండలానికి చెందిన రైతు
వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో
దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్‌లో హమాలీ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు.
కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్‌లో వ్యాపారుల సిండికేట్‌కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది.
చివరలో నిలిచిన పూతలు..
ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు.
టన్నుకు కనిష్టంగా రూ.20 వేలు..
నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్తారు. బాటసింగారం మార్కెట్‌యార్డుతో పాటు బాలాపూర్ మార్కెట్‌లో మామిడికాయల కొనుగోళ్లు సాగుతున్నాయి. వీటితో పాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా వ్యాపారులు కొనుగోలు దుకాణాలను ఏర్పాటుచేశారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ మార్కెట్‌కు రోజు 500 నుంచి 600 వాహనాల్లో మామిడికాయలు తరలించగా.. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు వారాలుగా రోజూ 1200 వాహనాల్లో కాయలు వస్తున్నాయి. విజయవాడ, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు మామిడికాయలు వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధరలను అమాంతం కుదించేశారు. పచ్చకాయలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు మాత్రమే కొంటున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ. 50వేల వరకు ధరను కట్టబెడుతున్నారు. మిగతా వారందరికీ రూ. 20వేల నుంచి రూ. 30వేలకే పరిమితం చేస్తున్నారు. కవర్‌కాయల ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టన్నుకు రూ. 70వేల నుంచి రూ. 1.30 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతుండగా.. వాస్తవానికి టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ.లక్ష వరకు ధర కల్పిస్తున్నారు.
స్థానికంగా
మార్కెట్ లేకపోవడమే..
మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్‌లో మార్కెట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మార్కెట్‌లో కొల్లాపూర్ మామిడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడతారు. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. రైతులు అడిగితే ఏపీ నుంచి కాయలు పెద్దమొత్తంలో వస్తుండటంతో ధరలు తగ్గించామనే సమాధానం చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు తగ్గితే.. స్థానికంగా కాయలు కొనుగోలుచేసే ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను తగ్గించేస్తున్నారు. కొల్లాపూర్‌లో ప్రభుత్వమే మార్కెట్ ఏర్పాటుచేసి.. ఇక్కడి కాయలను స్థానికంగా విక్రయించుకునే వెసలుబాటు ఉంటే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని మామిడి రైతులు కోరుతున్నారు.
మార్కెట్‌లో భారీగా పడిపోయిన ధరలు
టన్నుకు రూ.20 వేల నుంచి
రూ.45వేలకు మాత్రమే కొనుగోలు
కవర్ కాయల పరిస్థితి కూడా అంతే..
ఆందోళనలో మామిడి రైతులు


