కొత్త విధానంలో కొనుగోళ్లు..
మిల్లుల కేటాయింపు..
జిల్లాలో ఇలా..
ధాన్యం కొనుగోళ్లలో కొత్త నిబంధనలు అమలు
మరికల్: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వాహనంలో ఏ రోజు లోడ్ చేస్తే అదేరోజు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేసిన తర్వాత మాన్యువల్ ట్రక్‌షీట్‌తో రైస్‌మిల్లులకు తరలించేవారు. అనంతరం సొసైటీ, ఐకేపీ సిబ్బంది ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినప్పుడు రైతు సెల్‌ఫోన్‌కు ఓటీపీ వచ్చేది. కాగా కొత్త విధానంతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఏర్పడే అవకాశం ఉందని కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగుకాగా.. 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకుగాను 160 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆ ధాన్యాన్ని 51 రైస్‌మిల్లులను తరలించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి ఆయా కేంద్రాల్లో ఽఆన్‌లైన్ ధాన్యం కొనుగోళ్లు అమలులోకి వచ్చింది. అయితే ఈ విధానంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తూకం వేసిన వెంటనే రైతు పేరు, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే రైతు మొబైల్‌కు ఓటీపీ వస్తోంది. అనంతరం ఆన్‌లైన్ ట్రక్‌షీట్ జారీ చేయడంతో పూర్తి వివరాలు రైతు తెలుసుకొనే అవకాశం ఉంది. అంతేగాకుండా ఆన్‌లైన్‌లో చూపించిన రైస్‌మిల్లుకు మాత్రమే జీపీఎస్ ఉన్న ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యం తరలించాల్సి ఉంటుంది. అయితే మండలానికి ఒక్కటే ట్యాబ్ ఇవ్వడంతో ఏ రోజు ధాన్యం తరలిస్తే అదేరోజు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
రైతులు నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యం జీపీఎస్ ఉన్న వాహనంలో ఆన్‌లైన్‌లో ఎంపికై న మిల్లుకు ధాన్యం తరలిస్తారు. కొత్త పద్దతి విధానంలో రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం.
– సైదులు, డీఎం, పౌరసరఫరాల సంస్థ
గత సీజన్ వరకు ధాన్యాన్ని మిల్లులకు మాన్యువల్ విధానంలో కేటాయించే వారు. ధాన్యం ఏ మిల్లుకు వెళ్లనుందో కొనుగోలు కేంద్రం నిర్వాహకుడికి ముందే తెలిసేది. కొత్త విధానంలో ధాన్యం ఏ మిల్లుకు వెళ్తుందో తెలియదు. ఆన్‌లైన్‌లో ట్రక్‌షీట్ జనరేట్ అయిన తర్వాత అటోమెటిక్‌గా మిల్లు చూపిస్తుంది. ఆ మిల్లుకే డ్రైవర్ ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. ఇలా అంతా ఆన్‌లైన్‌లోనే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుంది.
జీపీఎస్ వాహనాల్లో ధాన్యం
మిల్లులకు తరలింపు
అదే రోజున వివరాల నమోదు
పూర్తి సమాచారం రైతుల సెల్‌ఫోన్‌కు..


