స్వీయగణనను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

స్వీయగణనను వినియోగించుకోవాలి

Apr 28 2026 7:29 AM | Updated on Apr 28 2026 7:29 AM

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి..

నారాయణపేట: స్వీయగణనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రియాంక కోరారు. జనగణన ప్రక్రియలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో స్వీయ నమోదు చేసుకొని మాట్లాడారు. జనగణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్‌ స్వీయగణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్‌ పోర్టల్‌లోగాని, మొబైల్‌ యాప్‌ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు. వచ్చే నెల 10వ తేదీ వరకు స్వీయ నమోదుకు అవకాశం ఉందని చెప్పారు. వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రత్యేక సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ఐడీ జారీ అవుతుందని.. మే నెల 11 నుంచి జూన్‌ 9 మధ్యకాలంలో ఇంటికొచ్చిన ఎన్యూమరేటర్లకు ఐడీ నంబర్‌ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో చేసుకుంటే ధ్రువీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదని.. సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ఐడీ ద్వారా పరిశీలించి ధ్రువీకరిస్తారని వివరించారు. అయితే స్వీయ గణనలో కచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తూ, సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఈ వివరాలు ఎంతో దోహదపడతాయని.. ఈ ప్రక్రియ జిల్లాలో విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు.

వైద్య కళాశాల, ఆస్పత్రి తనిఖీ..

మండలంలోని అప్పక్‌పల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పతి, ప్రభుత్వ వైద్య కళాశాలను సోమవారం సాయంత్రం కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్‌ వద్దకు వెళ్లి రోజుకు ఎంతమంది రోగులు వస్తారని అడిగి తెలుసుకున్నారు. రెండో అంతస్తులో పలు వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్యసేవలు, వసతులపై ఆరా తీశారు. తాగునీటి సమస్య ఉందని రోగుల బంధువులు వివరించగా.. ఆర్వో ప్లాంట్‌ లేదా అని ఆర్‌ఎంఓ శ్రీనివాసులును ప్రశ్నించారు. బోరు వేస్తే నీళ్లు రాలేదని, ఆర్వో ప్లాంట్‌ లేదని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆస్పత్రి సమావేశ మందిరంలో ఆర్‌ఎంఓ, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, వైద్యులతో సమావేశమయ్యారు. ఆస్పత్రి క్యాడర్‌ స్ట్రెంథ్‌, అవసరమైన వైద్య పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. డయాలసిస్‌ సేవలపై ఆరా తీయగా పాత చిన్నపిల్లల ఆస్పత్రిలో కొనసాగుతోందని ఆర్‌ఎంఓ తెలిపారు. వైద్య కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ప్రశ్నించగా మొదటి, రెండో సంవత్సరం కలిపి 100 మంది ఉన్నారని, నర్సింగ్‌ కళాశాల కొనసాగుతోందని వివరించారు. ఆస్పత్రి నిర్వహణ, ఇతర సదుపాయాలు, సమస్యలపై కలెక్టర్‌ చర్చించారు.

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సీహెచ్‌. ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో 23 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement